రంజీ ఫైనల్లో శతక్కొట్టిన యువ కెరటం​ | Vidarbha Batter Danish Malewar Scored Hundred In Ranji Trophy Final Against Kerala | Sakshi

రంజీ ఫైనల్లో శతక్కొట్టిన యువ కెరటం​

Feb 26 2025 3:39 PM | Updated on Feb 26 2025 4:31 PM

Vidarbha Batter Danish Malewar Scored Hundred In Ranji Trophy Final Against Kerala

రంజీ ట్రోఫీ 2024-25 (Ranji Trophy) ఎడిషన్‌ ఫైనల్‌ (Ranji Final) మ్యాచ్‌ ఇవాళ (ఫిబ్రవరి 26) మొదలైంది. గతేడాది రన్నరప్‌ విదర్భ (Vidarbha).. తొలిసారి ఫైనల్‌కు చేరిన కేరళతో (Kerala) తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో కేరళ టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. తొలుత బౌలింగ్‌ చేసిన కేరళకు ఆదిలోనే ఫలితం లభించింది. ఆ జట్టు బౌలర్‌ నిధీశ్‌ మ్యాచ్‌ రెండో బంతికే విదర్భ ఓపెనర్‌ పార్థ్‌ రేఖడేను (0) ఔట్‌ చేశాడు. 

అనంతరం నిధీశ్‌ ఏడో ఓవర్‌లో మరో వికెట్‌ తీశాడు. 11 పరుగుల స్కోర్‌ వద్ద నిధీశ్‌ దర్శన్‌ నల్కండేను (1) పెవిలియన్‌కు పంపాడు. మరికొద్ది సేపటికే విదర్భ మూడో వికెట్‌ కోల్పోయింది. ఈసారి ఏడెన్‌ యాపిల్‌ టామ్‌ కేరళకు సక్సెస్‌ అందించాడు. టామ్‌.. విదర్భ స్టార్‌ బ్యాటర్‌ ధృవ్‌ షోరేను (16) ఔట్‌ చేశాడు. ఫలితంగా విదర్భ 24 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

సెంచరీతో కదంతొక్కిన దనిశ్‌ మలేవార్‌
ఈ దశలో 21 ఏళ్ల దనిశ్‌ మలేవార్‌ (Danish Malewar) సెంచరీతో కదంతొక్కి విదర్భను మళ్లీ మ్యాచ్‌లోకి తీసుకొచ్చాడు. దనిశ్‌ 168 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. దనిశ్‌ తన సెంచరీ మార్కును సిక్సర్‌, బౌండరీతో అందుకున్నాడు. 

దనిశ్‌కు స్టార్‌ ఆటగాడు కరుణ్‌ నాయర్‌ (Karun Nair) సహకారం అందిస్తున్నాడు. కరుణ్‌ సైతం అర్ద సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దనిశ్‌, కరుణ్‌ నాలుగో వికెట్‌కు అజేయంగా 158 పరుగులు జోడించారు. 63 ఓవర్లు ముగిసే సరికి విదర్భ స్కోర్‌ 183/3గా ఉంది. దనిశ్‌ 116.. కరుణ్‌ 51 పరుగులతో ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నారు.

భీకర ఫామ్‌లో దనిశ్‌
దనిశ్‌ ప్రస్తుత రంజీ సీజన్‌లో భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఈ సీజన్‌లో దనిశ్‌ 13 ఇన్నింగ్స్‌ల్లో రెండు సెంచరీలు, నాలుగు హాఫ్‌ సెంచరీల సాయంతో 600 పైచిలుకు పరుగులు చేశాడు. ఫైనల్లో సెంచరీతో మెరిసిన దనిశ్‌.. క్వార్టర్‌ ఫైనల్‌, సెమీస్‌లో అర్ద సెంచరీలతో రాణించాడు. 

దనిశ్‌ ఇదే సీజన్‌తో ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆంధ్రతో జరిగిన అరంగ్రేటం మ్యాచ్‌లోనే అర్ద సెంచరీతో ఆకట్టుకున్నాడు. అనంతరం వరుసగా 46, 42, 59, 115, 17, 13, 3, 75, 0, 79, 29, 118* పరుగులు స్కోర్‌ చేశాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement