ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని ఓ అరుదైన ఘనతను టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి సాధించాడు. అండర్ 19 ప్రపంచకప్ (2008), వన్డే ప్రపంచకప్ (2011), ఛాంపియన్స్ ట్రోఫీ (2013), టీ20 వరల్డ్‌కప్ (2024) గెలిచిన తొలి క్రికెటర్‌గా విరాట్ రికార్డుల్లోకెక్కాడు. క్రికెట్ చరిత్రలో ఏ ఇతర ఆటగాడు ఇప్పటివరకు ఈ నాలుగు ఐసీసీ ట్రోఫీల విజయాల్లో భాగం కాలేదు.
అయితే ఈ రికార్డు విషయంలో విరాట్‌కు దగ్గరగా మరో టీమిండియా స్టార్ ఆటగాడు ఉన్నాడు. సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ కూడా అండర్ 19 ప్రపంచకప్ (2000), ఛాంపియన్స్ ట్రోఫీ (2002), టీ20 వరల్డ్‌కప్ (2007), వన్డే ప్రపంచకప్ (2011) విజయాల్లో భాగమైనప్పటికీ.. 2002 ఛాంపియన్స్ ట్రోఫీని భారత్, శ్రీలంక సంయుక్తంగా (వర్షం కారణంగా ఫలితం తేలలేదు)పంచుకున్నాయి. ఈ ఒక్క విషయంలో విరాట్.. యువరాజ్ కంటే ముందున్నాడు.
ఇదిలా ఉంటే, నిన్న (జూన్ 29) జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా.. సౌతాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించి, రెండో సారి పొట్టి ప్రపంచకప్‌కు కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో భారత గెలుపులో విరాట్ కోహ్లి (59 బంతుల్లో 76; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ అనంతరం విరాట్ అంతర్జాతీయ టీ20 కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. విరాట్‌తో పాటు రోహిత్ శర్మ కూడా తన టీ20 కెరీర్‌కు గుడ్ బై చెప్పాడు. విరాట్, రోహిత్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన మరుసటి రోజు (ఇవాళ) రవీంద్ర జడేజా కూడా అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు బై బై చెప్పాడు.
ఫైనల్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. విరాట్ కోహ్లి, అక్షర్ పటేల్ (31 బంతుల్లో 47; ఫోర్, 4 సిక్సర్లు), శివమ్ దూబే (16 బంతుల్లో 27; 3 ఫోర్లు, సిక్స్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్, నోకియా తలో 2 వికెట్లు పడగొట్టగా.. జన్సెన్, రబాడ చెరో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం 177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. హార్దిక్ పాండ్యా (3-0-20-3), అర్ష్‌దీప్ సింగ్ (4-0-20-2), బుమ్రా (4-0-18-2) సత్తా చాటడంతో లక్ష్యానికి 8 పరుగుల దూరంలో (169/8) నిలిచిపోయింది. లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా ఆదిలో తడబడినప్పటికీ.. మధ్యలో క్లాసెన్ (27 బంతుల్లో 52; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) టీమిండియాను భయపెట్టాడు. ఆఖర్లో బుమ్రా, హార్దిక్, అర్ష్‌దీప్ అద్బుతంగా బౌలింగ్ చేయడంతో టీమిండియా విజయతీరాలకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment