'వారి ఇన్నింగ్స్‌ చూస్తున్నా.. అప్పుడే డాక్టర్‌ పిలిచారు' | Virat Kohli Recalls Watching Brisbane Test From Hospital | Sakshi
Sakshi News home page

'వారి ఇన్నింగ్స్‌ చూస్తున్నా.. అప్పుడే డాక్టర్‌ పిలిచారు'

Published Thu, Feb 4 2021 7:17 PM | Last Updated on Thu, Feb 4 2021 7:23 PM

Virat Kohli Recalls Watching Brisbane Test From Hospital - Sakshi

చెన్నై: బ్రిస్బేన్‌ టెస్టులో టీమిండియా చారిత్రక విజయాన్ని అంత తొందరగా మరిచిపోలేం. సీనియర్ల గైర్హాజరీలో యువకులతో నిండిన జట్టు 32 ఏళ్ల ఆసీస్‌ జైత్రయాత్రకు చెక్‌ పెడుతూ టెస్టు విజయంతో పాటు సిరీస్‌ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే గబ్బా టెస్టులో టీమిండియా విజయానికి రిషబ్‌ పంత్‌, పుజారా పోరాటం ఎంతో కీలకమో.. సుందర్‌- శార్దూల్‌ ద్వయం తొలి ఇన్నింగ్స్‌లో నెలకొల్పిన 123 పరుగులు విలువైన భాగస్వామ్యానికి అంతే స్థానం ఉంది. వీరిద్దరే లేకుంటే గబ్బా టెస్టులో టీమిండియా పరిస్థితి వేరేలా ఉండేది. తాజాగా టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి బ్రిస్బేన్‌ టెస్టుకు సంబంధించి మరోసారి గుర్తుచేసుకున్నాడు. ఇంగ్లండ్‌తో తొలిటెస్టుకు సన్నద్దమవుతున్న వేళ కోహ్లి మీడియా సమావేశంలో​ పాల్గొన్నాడు.

'బ్రిస్బేన్‌ టెస్టులో టీమిండియా సాధించిన చారిత్రక విజయం గురించి ఇప్పటికే చాలాసార్లు చర్చించా. అయితే ఆరోజు జరిగిన మరో ఆసక్తికర విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నా. బ్రిస్బేన్‌ టెస్టు సమయంలో ఆసుపత్రిలో ఉన్న నేను సుందర్‌.. శార్దూల్‌ బ్యాటింగ్‌ను నా ఫోన్‌లో ఆస్వాదిస్తున్నా. వారిద్దరి సమన్వయంతో 127 పరుగుల కీలక భాగస్వామ్యం ఏర్పడింది. వారి ఇన్నింగ్స్‌ చూస్తున్న సమయంలోనే నాకు డాక్టర్‌ నుంచి పిలుపు వచ్చింది. ఒక బిడ్డకు తండ్రి అవడం అనేది నా జీవితంలో గొప్ప అనుభూతి.

అదే సమయంలో టీమిండియా చారిత్రక టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకుంది. నేను చెప్పిన రెండు కారణాలు విభిన్న శైలిలో ఉన్నాయి.. యాదృశ్చికంగా నా జీవితంలో రెండు ఆనందాలు ఒకేసారి పొందడం ఆనందంగా ఉన్నా.. వాటిని ఒకదానితో మరొకటి ఎన్నటికీ పోల్చలేను. నేను లేకున్నా జట్టు విజయం సాధించడం.. ఆ మ్యాచ్‌ను నేను కళ్లారా వీక్షించడంతో టీమిండియాతో అనుబంధం మాత్రం ఎక్కడ ఉన్నా అలాగే ఉంటుందని మరోసారి రుజువైంది. చదవండి: ధోని గుర్తుగా కోహ్లి హెలికాప్టర్‌ షాట్‌

ఇక ఇంగ్లండ్‌తో సిరీస్‌కు మేం పూర్తి స్థాయిలో సన్నద్దమయ్యాం. పెటర్నిటీ సెలవుల అనంతరం జట్టుతో కలవడం ఆనందంగా అనిపిస్తుంది. ఆసీస్‌పై టెస్టు సిరీస్‌ విజయాన్ని ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ల్లోనూ కొనసాగిస్తాం. జూన్‌లో లార్డ్స్‌ వేదికగా జరగనున్న వరల్డ్‌ టెస్టు చాంపియన్‌పిప్‌ ఫైనల్‌కు అర్హత సాధించడమే మా కర్తవ్యంగా పెట్టుకున్నాం. ఇక రిషబ్‌ పంత్‌ వికెట్‌ కీపర్‌గా తుది జట్టులో కచ్చితంగా ఆడనున్నాడు.. అందులో ఎలాంటి సందేహం లేదు. బుమ్రా తిరిగి జట్టులోకి రావడంతో పేస్‌ విభాగం మరింత పటిష్టంగా తయారైంది. స్వదేశంలో బుమ్రాకు ఇదే తొలి టెస్టు అయినా.. ఇప్పటికే తనేంటో ప్రపంచానికి తెలియచేశాడు. అతని ఫామ్‌పై ఎలాంటి సందేహాలు లేవు.' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఇరుజట్ల మధ్య చెన్నై వేదికగా జరగనున్న తొలి టెస్టు మ్యాచ్‌ ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కానుంది.
చదవండి: సిక్సర్ల హోరు.. యునివర్సల్‌ బాస్‌ విధ్వంసం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement