24 ఏళ్లలో తొలిసారి.. 35 ఏళ్లలో నాలుగోసారి.. అది రా కోహ్లి అంటే..! | Virat Kohli Won The ICC ODI Player Of The Year Award For The Fourth Time, Most By Any - Sakshi
Sakshi News home page

ICC ODI Player Of The Year: 24 ఏళ్లలో తొలిసారి.. 35 ఏళ్లలో నాలుగోసారి.. అది రా కోహ్లి అంటే..!

Published Fri, Jan 26 2024 8:33 AM | Last Updated on Fri, Jan 26 2024 1:04 PM

Virat Kohli Won The ICC ODI Player Of The Year Award For The Fourth Time, Most By Any - Sakshi

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌, పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లి గురించి ఎంత చెప్పినా తక్కువే. కింగ్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన నాటి నుంచి తన బ్యాటింగ్‌ మెళకువలతో పట్ట పగ్గాల్లేకుండా దూసుకుపోతున్నాడు. మధ్యలో రెండేళ్లు తప్పించి.. ఇంటా బయటా, ఈ దేశం ఆ దేశం, స్పిన్నర్లు, పేసర్లు  అన్న తేడా లేకుండా అన్ని దేశాలపై, తన సమకాలీకులైన అందరూ బౌలర్లపై కోహ్లి పైచేయి సాధించాడు.

వయసు పైబడే కొద్ది అతను పాతబడ్డ వైన్‌లా ఇంకా మత్తుగా తయారవుతున్నాడు. కింగ్‌ ఇటీవలి ఫామే అందకు నిదర్శనం. గతేడాది ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో కెరీర్‌ అత్యుత్తమ ఫామ్‌ను కనబర్చిన కోహ్లి.. ఆ టోర్నీలో లీడింగ్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచి ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీగా నిలవడమే కాకుండా, ఆ ప్రదర్శన కారణంగా గతేడాది ఐసీసీ వన్డే ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డును గెలుచుకున్నాడు.

కోహ్లి అత్యంత ప్రతిష్టాత్మకమైన వన్డే ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డును గెలవడం​ ఇది తొలిసారి కాదు. కింగ్‌ 2012లోనే 24 ఏళ్ల వయసులో తొలిసారి ఈ అవార్డును గెలుచుకున్నాడు. కోహ్లి స్టామినా ఏ స్థాయిలో ఉందంటే.. అతను మళ్లీ 35 ఏళ్ల వయసులోనూ ఈ అవార్డును గెలుచుకున్నాడు. 11 ఏళ్ల తర్వాత ఏ క్రీడలో అయినా క్రీడాకారుల శోభ కాస్త తగ్గుతుంది. అయితే కోహ్లి అలా కాదు, వయసు పెరిగే కొద్ది ఇంకా రాటుదేలుతున్నాడు. పాతబడ్డ వైన్‌లా ఇంకా మత్తెక్కిస్తున్నాడు.

కోహ్లి తన కెరీర్‌లో ఇది సాధించలేదు అనడానికి లేకుండా దాదాపుగా అన్ని సాధించేశాడు. వరల్డ్‌కప్‌ గెలిచిన జట్టులో (2011) సభ్యుడిగా, వన్డే వరల్డ్‌కప్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీగా, 50 వన్డే శతకాలు చేసిన ఏకైక ఆటగాడిగా.. ఓ వరల్డ్‌కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా, ప్లేయర్‌ ఆఫ్‌ ద డికేడ్‌ 2010-2020గా (దశాబ్దం), నాలుగుసార్లు ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు (2012, 2017, 2018, 2023) గెలిచిన ఏకైక ఆటగాడిగా, అత్యధిక ఐసీసీ (4) అవార్డులు సాధించిన ఆటగాడిగా దాదాపు అన్ని రికార్డులను కవర్‌ చేశాడు.

కోహ్లి.. ప్రస్తుతం సచిన్‌ పేరిట ఉన్న 100 సెంచరీల రికార్డుపై కన్నేశాడు. ఈ ఒక్కటీ పూర్తి చేస్తే క్రికెటర్‌గా కోహ్లి జన్మ సంపూర్ణమైపోతుంది. ప్రస్తుతం అతను ఉన్న ఫామ్‌, అతని ఫిట్‌నెస్‌ స్థాయిలను బట్టి ఇది పెద్ద విషయమేమీ కాదు. త్వరలో కోహ్లి.. సచిన్‌ రికార్డును అధిగమిస్తాడని ఆశిద్దాం. ఇదిలా ఉంటే, కోహ్లి వ్యక్తిగత కారణాల చేత ప్రస్తుతం ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్ట్‌లకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement