న్యూఢిల్లీ: చైనా మొబైల్ సంస్థ ‘వివో’ ఈ ఏడాది ఐపీఎల్ స్పాన్సర్ షిప్ నుంచి తప్పుకున్నంత మాత్రాన బోర్డు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. బీసీసీఐ దగ్గర ఎప్పుడూ ప్లాన్ ‘బి’ ఉండనే ఉంటుందని వ్యాఖ్యానించాడు. ఒక వెబినార్‌లో అతడు మాట్లాడుతూ ‘నేను దీన్ని పెద్ద ఆర్థిక నష్టంలా భావించడం లేదు. ఇది కేవలం తాత్కాలిక సమస్య మాత్రమే. గత బోర్డు పాలకులు, మేటి ఆటగాళ్లు బీసీసీఐకి పటిష్ట పునాదులు వేశారు. అప్పుడపుడు ఎదురయ్యే సమస్యల్ని బలమైన బోర్డు ఎప్పట్లాగే అధిగమిస్తుంది. (ఆర్‌సీబీతోనే నా ప్రయాణం)
గొప్ప ఘనతలు, విశేషాలు ఇవన్నీ రాత్రికి రాత్రే జరిగిపోవు. అలాగే ఒక్కరాత్రితోనూ కూలిపోవు. కొన్ని నిర్ణయాలు లాభాలు తెస్తే మరికొన్ని నష్టాలు తేవొచ్చు. దేన్నయినా ఎదుర్కోవాలి. ధైర్యంగా సాగాలి’ అని అన్నాడు. చైనీస్ మొబైల్ బ్రాండ్ 2018– 2022 కాలానికి గానూ రూ. 2199 కోట్లు చెల్లించేలా బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఇరు దేశాల మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులతో భారత్‌లో చైనా ఉత్పాదనలన్నీ నిషేధించాలనే ఉద్యమం మొదలైంది. ఈ నేపథ్యంలో ‘వివో’ ఈ ఏడాది టైటిల్ స్పాన్సర్‌షిప్ నుంచి తప్పుకోవడంతో బీసీసీఐ స్పాన్సర్ వేటలో పడింది. అంతేకాకుండా 2021లో జరిగే పురుషుల టి20 ప్రపంచ కప్ ఆతిథ్య హక్కులను భారత్ చేజిక్కించుకోవడం తనకేం ఆశ్చర్యాన్ని కలిగించలేదని గంగూలీ అన్నాడు. ‘షెడ్యూల్ ప్రకారం 2021లో టి20, 2023లో వన్డే ప్రపంచ కప్‌లు భారత్ వేదికగా జరగాల్సి ఉన్నాయి. ఇప్పుడు అదే జరుగుతోంది’ అని గంగూలీ పేర్కొన్నాడు. 2022 టి20 ప్రపంచ కప్‌కు ఆస్ట్రేలియా ఆతిథ్యమివ్వనుంది.(సూపర్ కింగ్స్ ట్రైనింగ్‌కు గ్రీన్ సిగ్నల్)
Comments
Please login to add a commentAdd a comment