WBBL: స్మృతి కంటే జెమీమా, దీప్తి, శిఖాలకే ఎక్కువ ధర! | WBBL Draft Jemimah Deepti Sharma Platinum Category Know Price | Sakshi
Sakshi News home page

WBBL: స్మృతి కంటే జెమీమా, దీప్తి, శిఖాలకే ఎక్కువ ధర!

Published Mon, Sep 2 2024 12:01 PM | Last Updated on Mon, Sep 2 2024 12:39 PM

WBBL Draft Jemimah Deepti Sharma Platinum Category Know Price

మహిళల బిగ్‌బాష్‌ టి20 లీగ్‌లో ఆరుగురు భారత క్రికెటర్లు

స్మృతి మంధాన, జెమీమా, దీప్తి శర్మ, యస్తిక భాటియా, హేమలత, శిఖా పాండేలకు చోటు

కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌కు నిరాశ

అక్టోబర్‌ 27 నుంచి ఆస్ట్రేలియాలో టోర్నీ  

Womens Big Bash League Draft- మెల్‌బోర్న్‌: భారత మహిళల జట్టు వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధాన సహా ఆరుగురు భారత క్రికెటర్లు మహిళల బిగ్‌బాష్‌ టి20 లీగ్‌ (డబ్ల్యూబీబీఎల్‌)లో మెరిపించనున్నారు. ఓపెనర్‌ స్మృతి, ఆల్‌రౌండర్‌ శిఖా పాండే, టాపార్డర్‌ బ్యాటర్‌ జెమీమా రోడ్రిగ్స్‌లు ఇది వరకే ఈ లీగ్‌లో ఆడారు. 

అయితే కొత్తగా ఆల్‌రౌండర్‌ దయాళన్‌ హేమలత, వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ యస్తిక భాటియాలకు తొలిసారిగా బిగ్‌బాష్‌ చాన్స్‌ లభించింది. కానీ భారత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ను మాత్రం లీగ్‌ ఫ్రాంచైజీలు పక్కన బెట్టాయి.

‘ప్లాటినమ్‌’ కేటగిరీలో జెమీమా, దీప్తి
గతంలో మెల్‌బోర్న్‌ రెనిగేడ్స్, సిడ్నీ థండర్‌లకు ఆడిన అనుభవమున్న సీనియర్‌ బ్యాటర్‌పై ఎనిమిది ఫ్రాంచైజీల్లో ఏ ఒక్క జట్టు కూడా ఆసక్తి చూపకపోవడం గమనార్హం. హిట్టింగ్‌తో ఆదరగొట్టే బ్యాటర్‌ జెమీమాకు బ్రిస్బేన్‌ హీట్‌ ‘ప్లాటినమ్‌’ ఎంపిక ద్వారా పెద్దపీట వేసింది. ఐపీఎల్‌లో టాప్‌ 1, 2, 3 రిటెన్షన్‌ పాలసీలా డబ్ల్యూబీబీఎల్‌లో ప్లాటినమ్, గోల్డ్, సిల్వర్, బ్రాంజ్‌ కేటగిరీలుంటాయి.

మరో భారత ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మకు మెల్‌బోర్న్‌ స్టార్స్‌ ‘ప్లాటినమ్‌’ కేటగిరీలో ఎంపిక చేసుకుంది. ఈ కేటగిరీలోకి ఎంపికైన క్రికెటర్లకు రూ. 62.41 లక్షలు (లక్షా 10 వేల ఆసీస్‌ డాలర్లు) కాంట్రాక్టు మొత్తంగా లభిస్తుంది. 

శిఖా పాండేకు రూ. 51 లక్షలు
‘గోల్డ్‌’ కేటగిరీలో బ్రిస్బేన్‌ హీట్‌కు ఎంపికైన శిఖా పాండేకు రూ. 51 లక్షలు (90 వేల ఆసీస్‌ డాలర్లు), అడిలైడ్‌ స్ట్రయికర్స్‌కు స్మృతి మంధాన, పెర్త్‌ స్కార్చర్స్‌కు హేమలత, మెల్‌బోర్న్‌ స్టార్స్‌కు యస్తిక భాటియా సిల్వర్‌ కేటగిరీలో ఎంపికయ్యారు. 

ఈ ముగ్గురికి రూ. 36.88 లక్షలు (65 వేల ఆసీస్‌ డాలర్లు) కాంట్రాక్టు ఫీజుగా లభిస్తుంది. ఈ సీజన్‌ మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌ వచ్చే నెల 27న అడిలైడ్‌లో మొదలవుతుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ అడిలైడ్‌ స్ట్రయికర్స్‌తో బ్రిస్బేన్‌ హీట్‌ జట్టు తలపడుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement