‘శత’క్కొట్టిన జెమీమా రోడ్రిగ్స్
అర్ధ సెంచరీలతో స్మృతి, ప్రతీక, హర్లీన్ వీరవిహారం
వన్డేల్లో తమ అత్యధిక స్కోరు నమోదు (370/5) చేసిన భారత్
రెండో వన్డేలో ఐర్లాండ్‌పై 116 పరుగుల తేడాతో ఘనవిజయం
సిరీస్ 2–0తో సొంతం
భారత మహిళల జట్టు సొంతగడ్డలో ఐర్లాండ్‌పై ‘వైల్డ్ ఫైర్’ అయ్యింది. టాప్–4 బ్యాటర్లు గర్జించడంతో మన జట్టు వన్డేల్లో తమ అత్యధిక రికార్డు స్కోరును నమోదు చేసింది. ఓవరాల్‌గా అంతర్జాతీయ మహిళల వన్డే క్రికెట్లో మూడో అత్యధిక స్కోరు సాధించింది.
మిడిలార్డర్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ శతకంతో... ఓపెనర్లు స్మృతి మంధాన, ప్రతీక రావల్, వన్‌డౌన్‌లో హర్లీన్ డియోల్ ‘ఫిఫ్టీ’లతో చెలరేగారు. బౌలింగ్‌లో దీప్తి శర్మ, ప్రియా మిశ్రాలు ఐర్లాండ్ బ్యాటర్ల పని పట్టారు. దీంతో రెండో వన్డేలో స్మృతి మంధాన బృందం భారీ విజయాన్ని నమోదు చేసింది. తొలి రెండు వన్డేల్లో గెలుపుతో ద్వైపాక్షిక సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత జట్టు ఈనెల 15న జరిగే చివరిదైన మూడో వన్డేలో క్లీన్‌స్వీప్ లక్ష్యంగా బరిలోకి దిగనుంది.
రాజ్‌కోట్: భారత టాపార్డర్ టాప్ లేపే ప్రదర్శనతో ఐర్లాండ్ మహిళల్ని చితగ్గొట్టింది. రెండో వన్డేలో ఓపెనింగ్ జోడీ సహా తర్వాత వచ్చిన మూడు, నాలుగో వరుస బ్యాటర్లూ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో రాజ్‌కోట్ వేదిక పరుగుల ‘పొంగల్’ చేసుకుంది. ఆదివారం జరిగిన రెండో వన్డేలో భారత మహిళల జట్టు 116 పరుగుల భారీ తేడాతో ఐర్లాండ్‌పై ఘనవిజయం సాధించింది. మిడిలార్డర్ బ్యాటర్, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జెమీమా రోడ్రిగ్స్ (91 బంతుల్లో 102; 12 ఫోర్లు) తన కెరీర్‌లో తొలి శతకం సాధించగా... హర్లీన్ డియోల్ (84 బంతుల్లో 89; 12 ఫోర్లు), కెప్టెన్ స్మృతి మంధాన (54 బంతుల్లో 73; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు), ప్రతీక రావల్ (61 బంతుల్లో 67; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలతో అదరగొట్టారు.
దీంతో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణిత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 370 పరుగుల భారీస్కోరు చేసింది. గతంలో భారత జట్టు ‘బెస్ట్’ స్కోరు 358. 2017లో ఐర్లాండ్‌పై 358/2 చేసిన అమ్మాయిల జట్టు గత నెల విండీస్‌పై కూడా 358/5తో ఆ ‘బెస్ట్’ను సమం చేసింది. తర్వాత కొండంత లక్ష్యాన్ని ఛేదించలేక ఐర్లాండ్ 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 254 పరుగులకు పరిమితమైంది. క్రిస్టీనా కూల్టర్ (113 బంతుల్లో 80; 10 ఫోర్లు) ఒంటరి పోరాటం చేసింది. దీప్తి శర్మ 3, ప్రియా మిశ్రా 2 వికెట్లు తీశారు. తొలి వన్డే గెలిచిన స్మృతి సేన తాజా విజయంతో 2–0తో సిరీస్ వశం చేసుకుంది. 15న చివరి వన్డే జరగనుంది.
స్మృతి, ప్రతీక ఫైర్
బ్యాటింగ్‌కు దిగగానే ఓపెనర్లు స్మృతి, ప్రతీక ఐర్లాండ్ బౌలింగ్‌ను తుత్తునీయలు చేస్తూ భారీస్కోరుకు గట్టి పునాది వేశారు. దీంతో 7.2 ఓవర్లలో 50 స్కోరు చేసిన భారత్ 100కు (13 ఓవర్లలో) చేరేందుకు ఎంతోసేపు పట్టలేదు. స్మృతి 35 బంతుల్లో, ప్రతీక 53 బంతుల్లో అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఇలా ఓపెనర్లిద్దరే తొలి 19 ఓవర్లలో 156 పరుగులు జోడించి శుభారంభం ఇచ్చారు.
అదే స్కోరు వద్ద వరుస బంతుల్లో ఇద్దరు నిష్క్రమించారు. ఇక్కడ ముగిసింది సినిమాల్లోలాగా ఫస్టాఫే! అంటే విశ్రాంతి. తర్వాత శుభం కార్డు జెమీమా, హర్లీన్‌ల జోరు చూపించింది. దీంతో 28 ఓవర్ల పాటు (19.1 నుంచి 47.1 ఓవర్ వరకు) వాళ్లిద్దరు మూడో వికెట్‌కు జతచేసిన 183 పరుగుల భాగస్వామ్యం స్కోరును కొండంతయ్యేలా చేసింది. హర్లీన్ 58 బంతుల్లో ఫిఫ్టీ కొడితే... జెమీమా 62 బంతుల్లో 50... 90 బంతుల్లో సెంచరీ సాధించింది.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: స్మృతి (సి) జార్జినా (బి) ప్రెండెర్‌గాస్ట్ 73; ప్రతీక (ఎల్బీడబ్ల్యూ) (బి) జార్జినా 67; హర్లీన్ (సి) లౌరా (బి) కెల్లీ 89; జెమీమా (బి) కెల్లీ 102; రిచా ఘోష్ (సి) ఫ్రెయా (బి) ప్రెండర్‌గాస్ట్ 10; తేజల్ (నాటౌట్) 2; సయాలీ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 25; మొత్తం (50 ఓవర్లలో 5 వికెట్లకు) 370. వికెట్ల పతనం: 1–156, 2–156, 3–339, 4–358, 5–368.
బౌలింగ్: వోర్లా ప్రెండర్‌గాస్ట్ 8–0–75–2, అవా క్యానింగ్ 10–0–51–0, అర్లెన్ కెల్లీ 10–0–82–2, ఫ్రెయా సర్జెంట్ 9–0–77–0, అలానా డాల్జెల్ 5–0–41–0, జార్జినా 8–0–42–1.
ఐర్లాండ్ ఇన్నింగ్స్: సారా (బి) దీప్తి 38; గాబీ లూయిస్ (సి) రిచా (బి) సయాలీ 12; క్రిస్టీనా (బి) టిటాస్ సాధు 80; వోర్లా (సి) సయాలీ (బి) ప్రియా 3; లౌరా (ఎల్బీడబ్ల్యూ) (బి) దీప్తి 37; లీ పాల్ (నాటౌట్) 27; కెల్లీ (బి) దీప్తి 19;
అవ క్యానింగ్ (బి) ప్రియా 11; జార్జినా (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 254. వికెట్ల పతనం: 1–32, 2–87, 3–101, 4–184, 5–188, 6–218, 7–234. బౌలింగ్: టిటాస్ సాధు 10–0–48–1, సయాలీ 9–1–40–1, సైమా ఠాకూర్ 9–0–50–0, ప్రియా మిశ్రా 10–0–53–2, దీప్తి శర్మ 10–0–37–3, ప్రతీక 2–0–12–0.
Comments
Please login to add a commentAdd a comment