T20 World Cup 2022- NZ Vs Aus- Aaron Finch: ‘‘మొదటి నాలుగు ఓవర్లలో న్యూజిలాండ్ ఓపెనర్లు అద్బుతంగా ఆడారు. మమ్మల్ని కోలుకోలేని దెబ్బ కొట్టారు. లక్ష్య ఛేదనలో శుభారంభం చేయాలని భావించినా.. మేము ఆ పని చేయలేకపోయాం’’ అని ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ అన్నాడు. తొలి మ్యాచ్‌లో భారీ ఓటమి కారణంగా.. టోర్నీలో తమకు మిగిలి ఉన్న మ్యాచ్‌లలో మరింత జాగ్రత్తగా ఆడాల్సి ఉందని పేర్కొన్నాడు.
టీ20 ప్రపంచకప్-2022 సూపర్-12 ఆరంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడ్డ ఆతిథ్య ఆసీస్‌కు ఘోర పరాభవం ఎదురైంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కంగారూలకు కివీస్ ఓపెనర్లు చుక్కలు చూపించారు. ముఖ్యంగా పవర్ ప్లేలో ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే ఆకాశమే హద్దుగా చెలరేగారు.
వీరిద్దరి విజృంభణతో ఆరు ఓవర్లు ముగిసే సరికి కివీస్ ఒక వికెట్ నష్టపోయి 65 పరుగులు చేసింది. ఆ తర్వాత కూడా న్యూజిలాండ్ బ్యాటర్లను ఆపడం ఆసీస్ బౌలర్ల తరం కాలేదు. దీంతో కివీస్ 200 పరుగుల మార్కు అందుకుంది.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ విఫలం కావడంతో 17.1 ఓవర్లకే ఆతిథ్య జట్టు కథ ముగిసింది. 89 పరుగులతో ఓటమి పాలైంది. దీంతో భవిష్యత్తులో గనుక భారీ విజయాలు సాధించకపోతే రన్‌రేటుపై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.
అదృష్టం కూడా కలిసిరావాలి
ఈ నేపథ్యంలో ఆసీస్ సారథి ఆరోన్ ఫించ్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ఓటమికి సమిష్టి వైఫల్యం కారణమని పేర్కొన్నాడు. ఈ మేరకు.. ‘‘ప్రత్యర్థి జట్టు ఓపెనర్లను కట్టడి చేయలేకపోయాం. లక్ష్య ఛేదనలోనూ ఆదిలోనే వికెట్లు కోల్పోయాం. నెట్ రన్‌రేటు కూడా దారుణంగా ఉంది. తదుపరి మ్యాచ్‌లో శ్రీలంకతో తలపడబోతున్నాం. మిగిలిన నాలుగు మ్యాచ్‌లలో మేము బాగా కష్టపడాల్సి ఉంటుంది. అదృష్టం కూడా కలిసిరావాలి’’ అని ఫించ్ వ్యాఖ్యానించాడు.
చదవండి: వరల్డ్‌కప్ గురించి ప్రశ్న.. అదిరిపోయే సమాధానం చెప్పిన ధోని
Comments
Please login to add a commentAdd a comment