T20 World Cup 2022 - New Zealand vs Australia: స్వదేశంలో భారీ అంచనాల నడుమ టీ20 ప్రపంచకప్-2022 బరిలోకి దిగిన డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా తొలి మ్యాచ్‌లోనే దారుణంగా విఫలమైంది. బౌలర్లు, బ్యాటర్ల సమిష్టి వైఫల్యం కారణంగా న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది.
టాస్ గెలిచి
సూపర్-12 ఆరంభం మ్యాచ్‌లో ఆస్ట్రేలియా- న్యూజిలాండ్ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య కంగారూ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఆసీస్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌కు ఓపెనర్లు ఫిన్ అలెన్(16 బంతుల్లో 42 పరుగులు), డెవాన్ కాన్వే (58 బంతుల్లో 92 పరుగులు- నాటౌట్) అద్భుత ఆరంభం అందించారు.
వీరిద్దరి విజృంభణతో 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి న్యూజిలాండ్ 200 పరుగులు చేయగలిగింది. ఆసీస్ బౌలర్లలో జంపాకు ఒకటి, హాజిల్‌వుడ్‌కు రెండు వికెట్లు దక్కాయి.
కుప్పకూలిన టాపార్డర్
న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి ఆసీస్ టాపార్డర్ కుప్పకూలింది. ఓపెనర్లు వార్నర్ 5, ఆరోన్ ఫించ్ 13.. వన్‌డౌన్ బ్యాటర్ మిచెల్ మార్ష్ 16 పరుగులకే పెవిలియన్ చేరారు. ఆ తర్వాత గ్లెన్ మాక్స్‌వెల్ చేసిన 28 పరుగులే ఆసీస్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోర్.
ఇక ఆఖర్లో ప్యాట్ కమిన్స్ 18 బంతుల్లో 21 పరుగులు చేశాడు. మిగతా వాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితం కాగా 17.1 ఓవర్లలో 111 పరుగులు మాత్రమే చేసి ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. టోర్నీలో తమ ఆరంభ మ్యాచ్‌లోనే 89 పరుగులతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. డెవాన్ కాన్వే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
మరీ చెత్తగా
ప్రతిష్టాత్మక టోర్నీలో స్వదేశంలో ఆరంభ మ్యాచ్‌లోనే ఆసీస్ చెత్త ప్రదర్శన కనబరిచింది. ఏ దశలోనూ ఆకట్టుకోలేకపోయింది. ఒక్కరంటే ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ రీతిలో ఆడలేదు. ఈ నేపథ్యంలో బౌలింగ్, బ్యాటింగ్‌లో స్థాయికి తగ్గట్లు రాణించలేక చతికిల పడ్డ ఫించ్ బృందంపై అభిమానులు మండిపడుతున్నారు.
డిఫెండింగ్ చాంపియన్ మరీ ఇంత చెత్తగా ఆడుతుందని ఊహించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసీస్ పరిస్థితి ఇలా ఉంటే.. న్యూజిలాండ్ అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో అదరగొట్టి సమిష్టి కృషితో విజయం సాధించింది.
చదవండి: T20 WC 2022: ఇదేం బ్యాటింగ్‌రా బాబు.. తొలి ఓవర్‌లోనే బౌలర్‌కు చుక్కలు!
T20 WC 2022: ఫిలిప్స్ అద్భుత విన్యాసం.. గాల్లోకి ఎగిరి డైవ్ చేస్తూ..!
Comments
Please login to add a commentAdd a comment