![WC 2023 Ind Vs Afg Great Gesture From Kohli Towards Naveen: Gambhir - Sakshi](/styles/webp/s3/article_images/2023/10/12/kohli.jpg.webp?itok=obC3fbjX)
అప్పుడు స్మిత్.. ఇప్పుడు నవీన్ విషయంలో కోహ్లి ఇలా(PC: ICC)
ICC WC 2023- Kohli- Naveen: ఒక ఆటగాడికి మద్దతుగా నిలవలేనపుడు.. అతడిని విమర్శించే హక్కు కూడా ఎవరికీ ఉండదని గౌతం గంభీర్ అన్నాడు. అభిమాన క్రికెటర్‌ను ఉత్సాహపరచడంలో తప్పులేదని.. అయితే, అది ఇతరులను హేళన చేసే విధంగా ఉండకూడదని హితవు పలికాడు.
ఏదేమైనా టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి.. అఫ్గనిస్తాన్ పేసర్ నవీన్ ఉల్ హక్ పట్ల వ్యవహరించిన తీరు గొప్పగా ఉందని గంభీర్ హర్షం వ్యక్తం చేశాడు. కాగా ఐపీఎల్-2023 సందర్భంగా ఆర్సీబీ స్టార్ కోహ్లి, అఫ్గాన్ పేసర్, లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ నవీన్ ఉల్ హక్ మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే.
గంభీర్ జోక్యంతో
ఈ క్రమంలో లక్నో మెంటార్ గంభీర్ సైతం నవీన్‌కు మద్దతుగా మైదానంలోకి రావడంతో వివాదానికి దారితీసింది. ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం నడించింది. ఈ ఘటన తర్వాత నవీన్ ఎక్కడ, ఏ మ్యాచ్‌లో కనిపించినా ప్రేక్షకులు కోహ్లి, కోహ్లి అంటూ ఆట పట్టిస్తూ వచ్చారు. కోహ్లి నామస్మరణతో నవీన్‌ను ట్రోల్ చేశారు.
స్వయంగా రంగంలోకి దిగిన కోహ్లి.. నవీన్‌తో చేతులు కలిపి
ఈ నేపథ్యంలో వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా కోహ్లి సొంతమైదానం అరుణ్‌జైట్లీ స్టేడియంలో బుధవారం కూడా ఇదే పునరావృతమైంది. అయితే ‘ఢిల్లీ బాయ్’ కోహ్లి మళ్లీ స్వయంగా అభిమానులను నిలువరించాడు. ఇలా చేయవద్దంటూ సున్నితంగా వాళ్లకు నచ్చజెప్పాడు.
అంతేకాదు.. ఆ తర్వాత అనూహ్య రీతిలో నవీన్‌తో చేతులు కలపగా ఇద్దరు చిరునవ్వులు చిందిస్తూ ‘థమ్సప్’ సంకేతం చూపించడం హైలైట్‌గా నిలిచింది. తాజా ఘటనతో నాటి వివాదానికి తెర పడినట్లయింది.
మరోసారి కోహ్లి గుర్తుచేశాడు
ఈ విషయంపై స్పందించిన గౌతం గంభీర్.. ‘‘కోహ్లి చేసిన పని ఎంతో గొప్పగా అనిపించింది. ఇక ఇప్పటి నుంచి రానున్న మ్యాచ్‌లలో ఎవరూ ఇలా చేయరనే అనుకుంటున్నా. దేశం కోసం ఆడే క్రమంలో ఒక్కో మెట్టు ఎక్కేందుకు ఆటగాడు ఎంతగా కష్టపడాల్సి ఉంటుందో.. ఎన్ని కఠిన సవాళ్లు అధిగమిస్తే ఈ స్థాయికి చేరుకుంటారో కోహ్లి మరోసారి అందరికీ గుర్తుచేశాడు.
వాళ్లు మన అతిథులు.. హుందాగా వ్యవహరించాలి
ఒకరికి అండగా నిలవలేనపుడు.. వాళ్లను విమర్శించే హక్కు కూడా మనకు ఉండదు. నిజానికి ఢిల్లీలో ప్రేక్షకులు కాస్త హుందాగా వ్యవహరించాల్సింది. ఇప్పుడు మనం వరల్డ్‌కప్ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నాం. ఇలాంటి సమయంలో పర్యాటక జట్లకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది.
వాళ్లు ఇక్కడి నుంచి వెళ్లేపుడు మధుర జ్ఞాపకాలు తీసుకువెళ్లేలా చూడాలేగానీ ఇలాంటివి చేయకూడదు’’ అని గంభీర్ స్టార్ స్పోర్ట్స్ షోలో వ్యాఖ్యానించాడు. ఇక అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో నవీన్ బౌలింగ్‌లో 10 బంతులు ఆడిన కోహ్లి 3 సింగిల్స్ తీశాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన అఫ్గన్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి ఘన విజయం సాధించింది.
కోహ్లి అంటే కోహ్లినే...
కాగా గత వరల్డ్ కప్‌లో టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరుగుతుండగా స్టీవ్ స్మిత్‌ను ప్రేక్షకులు ‘చీటర్’ అంటూ గేళి చేశారు. అయితే బ్యాటింగ్ చేస్తున్న విరాట్ కోహ్లి బౌండరీ వద్దకు వచ్చి అలా చేయవద్దని వారించడంతో పాటు స్మిత్ భుజంపై చేయి వేసి మద్దతు పలికాడు. వన్డే వరల్డ్‌కప్-2023 సందర్భంగా నవీన్ విషయంలోనూ హుందాగా వ్యవహరించి మరోసారి అభిమానుల మనసు గెలుచుకున్నాడు.
చదవండి: CWC 2023: అఫ్ఘనిస్తాన్‌పై గెలుపు అనంతరం రోహిత్ శర్మ ఏమన్నాడంటే..?
Comments
Please login to add a commentAdd a comment