WC 2023: కోహ్లి, రోహిత్‌ కాదు.. వరల్డ్‌కప్‌లో బాబర్‌ దుమ్ములేపుతాడు: గంభీర్‌ | Not Kohli Rohit: Gambhir Feels Babar Azam Will Set WC 2023 On Fire | Sakshi
Sakshi News home page

WC 2023: కోహ్లి, రోహిత్‌ కాదు.. వరల్డ్‌కప్‌లో దుమ్ములేపేది అతడే: గంభీర్‌ కామెంట్స్‌ వైరల్‌

Published Sat, Sep 23 2023 4:34 PM | Last Updated on Tue, Oct 3 2023 7:32 PM

Not Kohli Rohit: Gambhir Feels Babar Azam Will Set WC 2023 On Fire - Sakshi

ICC ODI WC 2023- Gambhir Comments On Babar Azam: మరో రెండు వారాల్లో క్రికెట్‌ మెగా సమరానికి తెర లేవనుంది. భారత్‌ వేదికగా పుష్కర కాలం తర్వాత వన్డే వరల్డ్‌కప్‌ జరుగనుంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌- గత ఎడిషన్‌ రన్నరప్‌ న్యూజిలాండ్‌ మధ్య మ్యాచ్‌తో అక్టోబరు 5న ఐసీసీ ఈవెంట్‌ షురూ కానుంది.

ఇక ఈ మెగా టోర్నీలో అక్టోబరు 14న దాయాదులు భారత్‌- పాకిస్తాన్‌ ఢీకొట్టనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే చిరకాల ప్రత్యర్థుల పోరుపై ఇరు దేశాల మాజీలు తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఓపెనర్‌ గౌతం గంభీర్‌ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.

ఫైర్‌ సెట్‌ చేసేది అతడే
ప్రపంచకప్‌-2023లో తాను పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం ఆట కోసమే ఎదురుచూస్తున్నానని గౌతీ పేర్కొన్నాడు. బాబర్‌ నైపుణ్యాలు అమోఘమని.. వరల్డ్‌కప్‌లో ఫైర్‌ సెట్‌ చేసేది అతడే అని పేర్కొన్నాడు. 

రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, డేవిడ్‌ వార్నర్‌, కేన్‌ విలియమ్సన్‌, జో రూట్‌ వంటి స్టార్‌ ఆటగాళ్లు ఉన్నా గానీ.. బాబర్‌ వేరే లెవల్‌ అంటూ ఆకాశానికెత్తాడు. బాబర్‌ ఆజంలోని ప్రత్యేక స్కిల్‌సెట్‌ అతడిని ఈ స్థాయిలో నిలిపిందంటూ వరల్డ్‌ నంబర్‌ 1 బ్యాటర్‌పై గౌతం గంభీర్‌ ప్రశంసలు కురిపించాడు.

మాకు కింగ్‌, హిట్‌మ్యాన్‌ మాత్రమే ఫేవరెట్‌
కాగా గంభీర్‌ వ్యాఖ్యలపై టీమిండియా ఫ్యాన్స్‌ సెటైర్లు వేస్తున్నారు. ఆసియా కప్‌-2023లో బాబర్‌ ఆజం ప్రదర్శన చూశాక కూడా ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు గంభీర్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు. సొంతగడ్డపై కింగ్‌ కోహ్లి, హిట్‌మ్యాన్‌ రోహిత్‌ మాత్రమే తమ ఫేవరెట్లు అంటూ సోషల్‌ మీడియాలో వరుస పోస్టులు చేస్తున్నారు. 

ఇక ఆసియా వన్డే కప్‌ తాజా ఎడిషన్‌లో నేపాల్‌పై 151 పరుగులతో చెలరేగిన బాబర్‌ ఆజం.. ఆ తర్వాత స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక చతికిలపడ్డాడు.  17 (22), 10 (24) 29 (35) స్కోర్లతో పూర్తిగా నిరాశపరిచాడు.

టీమిండియా చేతిలో ఘోర పరాభవం
కెప్టెన్‌గానూ జట్టును కనీసం ఫైనల్‌కు కూడా చేర్చలేకపోయాడు. ముఖ్యంగా టీమిండియా చేతిలో సూపర్‌-4లో 228 పరుగుల తేడాతో ఓటమి పాలు కావడం పాక్‌ జట్టు వైఫల్యాలను ఎత్తిచూపింది.

ఈ నేపథ్యంలో గౌతీ.. బాబర్‌ పేరును ప్రస్తావిస్తూ ప్రశంసలు కురిపించడం విశేషం. అది కూడా గతంలో.. ఒక్క పాక్‌ క్రికెటర్‌ను కూడా గౌతీ ప్రశంసించిన దాఖలాలు లేకపోవడంతో ఈసారి అతడి ఫ్యాన్స్‌ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇక నెదర్లాండ్స్‌తో అక్టోబరు 6 నాటి మ్యాచ్‌తో పాక్‌ తమ వరల్డ్‌కప్‌ ప్రయాణాన్ని ఆరంభించనుంది. 

చదవండి: Ind vs Aus: తప్పు నీదే.. వరల్డ్‌కప్‌ జట్టు నుంచి తీసేయడం ఖాయం.. జాగ్రత్త!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement