కేఎల్ రాహుల్
ICC ODI World Cup 2023- Team India: వన్డే ప్రపంచకప్-2023 టోర్నీ నేపథ్యంలో భారత జట్టులో కొత్త వాళ్లకు స్థానం ఉండే అవకాశమే లేదని టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ అన్నాడు. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ వంటి సీనియర్లు పూర్తిస్థాయిలో ఫిట్‌నెస్ సాధిస్తే యువ బ్యాటర్లు ఆశలు వదులుకోవాల్సిందేనని పేర్కొన్నాడు. అదే విధంగా.. ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఫామ్‌లోకి వస్తే మహ్మద్ సిరాజ్‌కు కూడా ఒక్కోసారి తుదిజట్టులో చోటు దక్కకపోవచ్చని అభిప్రాయపడ్డాడు.
కాగా అక్టోబరు 5- నవంబరు 19 వరకు భారత్ వేదికగా ఐసీసీ వన్డే ప్రపంచకప్ ఈవెంట్ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైన విషయం తెలిసిందే. దాదాపు పుష్కరకాలం తర్వాత ఇండియాలో ఈ మెగా ఈవెంట్ జరుగనున్న తరుణంలో ఆతిథ్య జట్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
కరేబియన్ దీవిలో టీమిండియా ప్రయోగాలు
ఈ క్రమంలో అన్ని రకాలుగా సన్నద్ధమయ్యే క్రమంలో మేనేజ్‌మెంట్ ఇప్పటికే వెస్టిండీస్ పర్యటనలో అనేక ప్రయోగాలు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ సహా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి విశ్రాంతినిచ్చి యువకులను ఆడించింది. అయితే, ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయినప్పటికీ సిరీస్‌ను 2-1తో గెలవడంతో జట్టుకు కాస్త ఊరట లభించింది.
బుమ్రా రీఎంట్రీ ఇస్తుండగా..
ఇదిలా ఉంటే.. ప్రధాన పేసర్ బుమ్రా సహా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్, మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్, వికెట్ కీపర్ బ్యాటర్ స్టార్ రిషభ్ పంత్ తదితరులు గాయాల కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. బుమ్రా కోలుకుని ఐర్లాండ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా కెప్టెన్ హోదాలో రీఎంట్రీ ఇవ్వనున్నాడు.
త్వరలోనే వాళ్లిద్దరు వస్తారు!
మరోవైపు.. జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్న రాహుల్, అయ్యర్ సైతం ఆగష్టు 30న ఆరంభం కానున్న ఆసియా కప్ టోర్నీ నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వన్డే వరల్డ్‌కప్ జట్టు కూర్పు గురించి మహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘‘శ్రేయస్ అయ్యర్ గాయపడ్డాడు. కేఎల్ రాహుల్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. త్వరలోనే వాళ్లిద్దరు జట్టులోకి తిరిగివస్తారని అనుకుంటున్నా. కాబట్టి మెగా ఈవెంట్ నేపథ్యంలో... జట్టులోకి కొత్తగా వస్తున్న ఆటగాళ్ల గురించి చర్చ అనవసరం.
వాళ్ల పేర్లు వరల్డ్‌కప్ టీమ్‌లో ఉండొచ్చు. కానీ తుదిజట్టులో మాత్రం వారికి చోటు దక్కడం కష్టం. ఒకవేళ అయ్యర్ తిరిగొస్తే కచ్చితంగా నాలుగో స్థానంలో ఆడతాడు. ఇక ఓపెనర్లు శుబ్‌మన్ గిల్, రోహిత్ శర్మ ఉండనే ఉన్నారు.
అంతటి సిరాజ్‌కు కూడా కష్టమే!
మూడో స్థానంలో విరాట్ కోహ్లి.. ఆ తర్వాతి స్థానాల్లో శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్/శార్దూల్ ఠాకూర్(పిచ్ స్వభావాన్ని బట్టి ఎనిమిదో నంబర్ ఆటగాడి ఎంట్రీ), కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, బుమ్రా ఉంటారు.
ఒక్కోసారి సిరాజ్‌కు కూడా తుదిజట్టులో ఛాన్స్ ఉండకపోవచ్చు. సిరాజ్ లాంటి సీనియర్‌నే అడ్జస్ట్ చేయలేని స్థితిలో ఇక కొత్తవాళ్లకు ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎలా చోటు దక్కుతుంది?’’ అని కైఫ్ పీటీతో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌లకు భారత జట్టులో చోటు దక్కినా వరల్డ్‌కప్ టోర్నీ ఆడే అవకాశం రాకపోవచ్చని అభిప్రాయపడ్డాడు.
చదవండి: పాకిస్తాన్‌కు బై బై.. యూఎస్‌ఏకు వలస వెళ్లిన స్టార్ క్రికెటర్
Comments
Please login to add a commentAdd a comment