ODI WC 2023: Stop Doing Such Low Standard Things, Ex Pakistan Star Slams Own Board PCB - Sakshi
Sakshi News home page

WC 2023: ఇలాంటి చెత్త పనులు చేయొద్దు: పీసీబీపై పాక్‌ మాజీ క్రికెటర్‌ ఘాటు విమర్శలు

Published Wed, Jun 28 2023 9:32 PM | Last Updated on Thu, Jun 29 2023 12:45 PM

WC 2023: Stop Doing Such Low Standard Things Ex Pakistan Star Destroys Own Board - Sakshi

ICC ODI WOrld Cup 2023: పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు తీరుపై ఆ దేశ మాజీ క్రికెటర్‌ కమ్రాన్‌ అక్మల్‌ మండిపడ్డాడు. అర్థంపర్ధంలేని అభ్యర్థనలతో పరువు తీయొద్దంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. దయచేసి.. ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం దెబ్బతినే పనులు చేయకండని బోర్డు సభ్యులకు విజ్ఞప్తి చేశాడు. కాగా భారత్‌ వేదికగా వన్డే ప్రపంచకప్‌-2023 జరుగనున్న విషయం తెలిసిందే.

ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి మంగళవారం విడుదల చేసింది. ఈ క్రమంలో పాకిస్తాన్‌.. హైదరాబాద్‌, అహ్మదాబాద్‌లలో ఒక్కో మ్యాచ్‌, బెంగళూరు, చెన్నై, కోల్‌కతాలో రెండేసి మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. 

మారుస్తారా ప్లీజ్‌!
అయితే, షెడ్యూల్‌లో భాగంగా అఫ్గనిస్తాన్‌తో చెన్నైలో, ఆస్ట్రేలియాతో బెంగళూరులో ఆడాల్సిన మ్యాచ్‌లను మార్చాల్సిందిగా పీసీబీ ఐసీసీని కోరినట్లు సమాచారం. పిచ్‌ల స్వభావం రిత్యా అఫ్గన్‌తో మ్యాచ్‌ బెంగళూరులో, ఆసీస్‌తో మ్యాచ్‌ చెన్నైలో ఆడేలా వేదికలు మార్చాలని కోరినట్లు తెలుస్తోంది.

ఈ విషయంపై స్పందించిన మాజీ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కమ్రాన్‌ అక్మల్‌ పీసీబీ తీరును ఎండగట్టాడు. పాక్‌ టీవీతో మాట్లాడుతూ ‘‘వాతావరణ పరిస్థితులు, వేదికలు జట్ల విజయావకాశాలను ప్రభావితం చేయలేవు. ముఖ్యంగా అంతర్జాతీయ క్రికెట్‌లో వీటి గురించి ప్రస్తావన అనవసరం. 

చెత్త రిక్వెస్టులు వద్దు
భారత్‌.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌ వంటి జట్లను ఓడిస్తూ పోతోంది. అది వాళ్ల సత్తా. మనమేమో ఆసీస్‌తో అక్కడే ఆడతాం.. అఫ్గనిస్తాన్‌తో ఇక్కడే ఆడతామంటూ కుంటిసాకులు వెదుక్కోవడం ఎందుకు? మన దృష్టి మొత్తం కేవలం ఆట మీద మాత్రమే ఉండాలి.

బోర్డు సభ్యులకు ఇదే నా విజ్ఞప్తి. దయచేసి ఇలాంటి చెత్త ప్రమాణాలతో కూడిన అభ్యర్థనలు చేయకండి. అంతర్జాతీయ క్రికెట్‌ విస్తృతి మరింత పెరిగింది. ఆటగాళ్లు తమ విజయాల గురించి సగర్వంగా చాటిచెప్పుకొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బోర్డు మాత్రం మేము ఇక్కడైతేనే ఆడి గెలవగలం అంటూ ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం దెబ్బతినేలా మాట్లాడటం సరికాదు.

ఇలాంటి వాటికి బోర్డు సభ్యులు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. దేశ క్రికెట్‌ స్థాయిని పెంచాలే గానీ తగ్గించేలా వ్యవహరించకూడదు’’ అని అక్మల్‌ పీసీబీని తూర్పారబట్టాడు.

వరల్డ్‌కప్‌-2023లో పాకిస్తాన్‌ జట్టు మ్యాచ్‌ల షెడ్యూల్‌, వివరాలు:
►అక్టోబర్ 12: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో పాకిస్థాన్ vs క్వాలిఫయర్ 2
►అక్టోబర్ 15: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పాకిస్థాన్ వర్సెస్ భారత్
►అక్టోబర్ 20: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో పాకిస్థాన్ vs ఆస్ట్రేలియా
►అక్టోబర్ 23: చెన్నైలోని చిదంబరం స్టేడియంలో పాకిస్థాన్ vs ఆఫ్ఘనిస్తాన్

►అక్టోబర్ 27: చెన్నైలోని చిదంబరం స్టేడియంలో పాకిస్థాన్ vs దక్షిణాఫ్రికా
►అక్టోబర్ 31: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో పాకిస్థాన్ vs బంగ్లాదేశ్
►నవంబర్ 4: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో పాకిస్థాన్ vs న్యూజిలాండ్
►నవంబర్ 12: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో పాకిస్థాన్ vs ఇంగ్లాండ్.

చదవండి: భార్యతో టీమిండియా స్టార్‌ హార్దిక్‌ పాండ్యా.. ఫొటోలు వైరల్‌! మరీ..
మాకు భుజాల నొప్పులు.. ధోనికి మెకాలి సమస్య.. అసలే సచిన్‌ బరువు! అందుకే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement