CWC 2023- Pakistan Team- PCB: వన్డే వరల్డ్‌కప్-2023లో ఘోర పరాభవం నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి బాబర్ ఆజం తప్పుకోగా.. పేసర్ షాహిన్ ఆఫ్రిదిని టీ20 సారథిగా ప్రకటించింది.
అదే విధంగా టెస్టు పగ్గాలను షాన్ మసూద్‌కు అప్పగించింది. ఇక కెప్టెన్సీ మార్పులతో పాటు పాలనా విభాగం, శిక్షనా సిబ్బందిలోనూ కీలక మార్పులు చేస్తోంది. ఇందులో భాగంగా.. మాజీ క్రికెటర్లు మహ్మద్ హఫీజ్‌ను డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా నియమించిన పీసీబీ.. వహాబ్ రియాజ్‌ను చీఫ్ సెలక్టర్‌గా ఎంపిక చేసింది.
బౌలింగ్ కోచ్‌లుగా ఉమర్ గుల్, సయీద్ అజ్మల్
తాజాగా.. పీసీబీ తమ కోచింగ్ స్టాఫ్‌లో మరో ఇద్దరు మాజీ క్రికెటర్లను చేర్చుకుంది. ఉమర్ గుల్, సయీద్ అజ్మల్‌లకు బౌలింగ్ కోచ్‌లుగా అవకాశం ఇచ్చింది. గుల్ ఫాస్ట్‌బౌలింగ్ విభాగానికి కోచ్‌గా సేవలు అందించనుండగా.. అజ్మల్ స్పిన్ దళానికి మార్గదర్శనం చేయనున్నాడు. వీరిద్దరు డిసెంబరులో ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా బాధ్యతలు చేపట్టనున్నారు.
ఈ మేరకు పీసీబీ చైర్మన్ జకా ఆష్రఫ్ మంగళవారం ప్రకటన విడుదల చేశాడు. కాగా ఉమర్ గుల్ ఇప్పటికే పాకిస్తాన్ జట్టుతో ప్రయాణం ఆరంభించాడు. అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్ సందర్భంగా కోచ్‌గా వ్యవహరించాడు.
మోర్నీ మోర్కెల్ గుడ్‌బై
కాగా భారత్ వేదికగా ప్రపంచకప్ ఈవెంట్లో పాకిస్తాన్ దారుణ వైఫల్యంతో విమర్శల పాలైన విషయం తెలిసిందే. ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన బాబర్ బృందం వరుస ఓటముల కారణంగా.. కనీసం సెమీస్ కూడా చేరకుండానే నిష్క్రమించింది.
ముఖ్యంగా వన్డే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అఫ్గనిస్తాన్ చేతిలో చిత్తై పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో బాబర్ ఆజం కెప్టెన్సీ నుంచి తప్పుకోగా.. బౌలింగ్ కోచ్‌గా మోర్నీ మోర్కెల్ తన విధుల నుంచి వైదొలిగాడు.
ఉమర్ గుల్.. సయీద్ అజ్మల్ కెరీర్ వివరాలు
పాకిస్తాన్ తరఫున 2003లో ఎంట్రీ ఇచ్చిన 2016లో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఇక తన కెరీర్‌లో ఈ రైటార్మ్ పేసర్ 47 టెస్టులాడి 163, 130 వన్డేల్లో 179, 60 టీ20లలో 85 వికెట్లు పడగొట్టాడు.
అజ్మల్ విషయానికొస్తే.. 2008లో ఇంటర్నేషనల్ క్రికెట్ మొదలుపెట్టిన ఈ రైటార్మ్ ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్.. 2015లో ఆటకు గుడ్‌బై చెప్పాడు. తన కెరీర్‌లో 35 టెస్టులు, 113 వన్డేలు, 64 టీ20 మ్యాచ్‌లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 178, 184, 85 వికెట్లు పడగొట్టాడు.
చదవండి: T20 WC: ‘వరల్డ్‌కప్-2024లో కెప్టెన్ రోహిత్ శర్మనే! కోహ్లి కూడా..’
Comments
Please login to add a commentAdd a comment