బ్రిడ్జిటౌన్ (బార్బడోస్) : వెస్టిండీస్ క్రికెట్ జట్టు మాజీ పేస్ బౌలర్ ఇజ్రా మోస్లే రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. 63 ఏళ్ల మోస్లే బ్రిడ్జిటౌన్‌లో శనివారం తన సైకిల్‌పై స్థానిక ఏబీసీ హైవేపై వెళ్తుండగా ఓ టీనేజర్ నడిపిస్తున్న కారు ఆయనను ఢీకొట్టడంతో మృతి చెందారు. దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుపై నిషేధం ఉన్న సమయంలో 1982–1983లో అక్కడ పర్యటించిన వెస్టిండీస్ రెబెల్ జట్టులో మోస్లే సభ్యుడిగా ఉన్నారు. దాంతో ఆయన నిషేధానికి గురయ్యారు. నిషేధం ఎత్తివేశాక 32 ఏళ్ల ప్రాయంలో 1990 నుంచి 1991 మధ్యకాలంలో మోస్లే ప్రాతినిధ్యం వహించి రెండు టెస్టులు ఆడి ఆరు వికెట్లు... తొమ్మిది వన్డేలు ఆడి ఏడు వికెట్లు పడగొట్టారు. 2016లో భారత్ వేదికగా జరిగిన మహిళల టి20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన వెస్టిండీస్ మహిళల జట్టుకు మోస్లే అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించారు.
భారత టెన్నిస్ దిగ్గజ కోచ్ అక్తర్ అలీ కన్నుమూత
కోల్‌కతా: భారత అలనాటి మేటి టెన్నిస్ ప్లేయర్, దిగ్గజ కోచ్ అక్తర్ అలీ కోల్‌కతాలో ఆదివారం కన్నుమూశారు. 81 ఏళ్ల అక్తర్ అలీ కొన్నాళ్లుగా అనారోగ్యంతో ఉన్నారు. అక్తర్ అలీ తనయుడు జీషాన్ అలీ ప్రస్తుత భారత డేవిస్‌కప్ జట్టు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. 1939 జూలై 5న జన్మించిన అక్తర్ అలీ 1955లో జాతీయ జూనియర్ చాంపియన్‌గా నిలిచారు. అదే ఏడాది వింబుల్డన్ జూనియర్ బాలుర సింగిల్స్‌లో సెమీఫైనల్‌కు చేరారు. అనంతరం 1958 నుంచి 1964 మధ్యకాలంలో అక్తర్ అలీ భారత డేవిస్‌కప్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడంతోపాటు కెప్టెన్‌గా ఉన్నారు. 1968లో జాతీయ స్క్వాష్ చాంపియన్‌గా కూడా నిలిచిన ఆయన ప్లేయర్‌గా రిటైరయ్యాక 1966 నుంచి 1993 వరకు భారత జట్టుకు కోచ్‌గా వ్యవహరించారు. అక్తర్ అలీ కోచ్‌గా ఉన్నపుడే భారత జట్టు రెండుసార్లు (1966, 1974) డేవిస్ కప్‌లో ఫైనల్‌కు చేరి రన్నరప్‌గా నిలిచింది. మలేసియా (1968–1970; 1991–1993), బెల్జియం (1980–1984) జట్లకు కూడా కోచ్‌గా వ్యవహరించిన అక్తర్ అలీని కేంద్ర ప్రభుత్వం 2000లో అర్జున అవార్డుతో గౌరవించింది.
అమెరికా మాజీ బాక్సర్ లియోన్ స్పింక్స్ మృతి
లాస్ వేగస్: అమెరికా ప్రొఫెషనల్ బాక్సర్, 1976 మాంట్రియల్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత లియోన్ స్పింక్స్ కన్నుమూశాడు. 67 ఏళ్ల స్పింక్స్ కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. 1978లో అమెరికా దిగ్గజ బాక్సర్ మొహమ్మద్ అలీపై గెలుపొంది హెవీవెయిట్ టైటిల్ నెగ్గిన స్పింక్స్ ఒక్కసారిగా బాక్సింగ్ ప్రపంచాన్ని కుదిపేశాడు. 15 రౌండ్ల పాటు జరిగిన ఆ బౌట్‌లో అంచనాల్లేకుండా బరిలోకి దిగిన స్పింక్స్ విజేతగా నిలిచాడు. అంతకుముందు 1976 మాంట్రియల్ ఒలింపిక్స్‌లో పురుషుల లైట్ హెవీవెయిట్ విభాగంలో పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అతిగా మద్యానికి బానిసైన ఆయన రిటైరయ్యాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు.
రోడ్డు ప్రమాదంలో విండీస్ మాజీ క్రికెటర్ దుర్మరణం
Published Mon, Feb 8 2021 7:58 AM | Last Updated on Mon, Feb 8 2021 11:39 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment