![Windies Sensational Bowler Shamar Joseph Got Offers From PSL And ILT20 After Sensational Performance - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/30/Untitled-6_0.jpg.webp?itok=8KE1-9Pj)
ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో సంచలన ప్రదర్శనలు నమోదు చేసి వార్తల్లో నిలిచిన విండీస్ పేసర్ షమార్ జోసఫ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ లీగ్‌ల నుంచి ఆఫర్లు వెల్లువలా వస్తున్నాయి. 24 ఏళ్ల షమార్‌కు తొలుత పాకిస్తాన్ క్రికెట్ లీగ్ నుంచి ఆహ్వానం లభించింది. షమార్ నిన్ననే పీఎస్‌ఎల్‌లో పెషావర్ జల్మీ ఫ్రాంచైజీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. షమార్‌కు తాజాగా మరో ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది. ఫిబ్రవరి 1న అతను ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌తో డీల్ చేసుకోనున్నట్లు సమాచారం. అరంగేట్రం సిరీస్‌తోనే (ఆసీస్) షమార్ జీవితం ఒక్కసారిగా మారిపోయింది.
షమార్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కడంతో పాటు విదేశీ లీగ్‌ల నుంచి ఆఫర్లు, ఎండార్స్‌మెంట్లు వస్తున్నాయి. అరంగేట్రం సిరీస్‌కు ముందు సెక్యూరిటీ గార్డ్‌గా పని చేసిన షమార్ రాత్రికిరాత్రి హీరో అయిపోయాడు. ఆసీస్‌తో రెండో టెస్ట్‌లో ప్రదర్శనకు గానూ షమార్ విశ్వవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు నుంచి ప్రశంసలను అందుకుంటున్నాడు. ఆసీస్ మీడియా సహా ప్రపంచ మీడియా మొత్తం ఈ యువ పేసర్‌కు జేజేలు పలుకుతుంది. మాజీలు, విశ్లేషకులు షమార్ బౌలింగ్ ప్రదర్శనలను కొనియాడుతున్నాడు. షమార్ విండీస్ క్రికెట్‌కు పూర్వ వైభవం తీసుకువస్తాడని వారు అభిప్రాయపడుతున్నారు.
రెండో టెస్ట్‌లో ఆసీస్‌ను ఓడించిన అనంతరం విండీస్ మాజీలు కన్నీటిపర్యంతమవుతూ షమార్‌ను ఆకాశానికెత్తిన వైనం క్రికెట్ అభిమానులకు బాగా కనెక్ట్ అయ్యింది. ప్రభ కోల్పోతున్న టెస్ట్ క్రికెట్‌ను షమార్ మళ్లీ జీవం పోశాడంటూ ఆసీస్ మీడియా షమార్‌ను కొనియాడుతుంది. షమార్ ఇదే ప్రదర్శనను కొనసాగిస్తే భవిష్యత్తులో అతనికి ఐపీఎల్ బంపరాఫర్ కూడా లభించే అవకాశం ఉంది. ఇప్పటికే పలు ఐపీఎల్ ఫ్రాంచైజీలు షమార్‌పై కన్నేసి ఉంచాయి. గాయపడిన ఆటగాళ్ల స్థానంలో షమార్‌ను తమ పంచన చేర్చుకోవాలని ఆశిస్తున్నాయి.
కాగా, ఆస్ట్రేలియాతో వారి స్వదేశంలో జరిగిన 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో షమార్ రెండు ఐదు వికెట్ల ప్రదర్శనలతో 13 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచాడు. తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగిన షమార్.. ఆ మ్యాచ్‌లో బ్యాట్‌తోనూ రాణించాడు. రెండో టెస్ట్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో అయితే షమార్ పట్టపగ్గాలు లేకుండా దూసుకుపోయాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో షమార్ 7 వికెట్ల ప్రదర్శన టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ప్రదర్శనగా కీర్తించబడుతుంది. ఈ ప్రదర్శన కారణంగానే షమార్ ఓవర్‌నైట్ హీరో అయిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment