
West Indies Vs Pakistan ODI Series: గత కొంతకాలంగా వివిధ కారణాల చేత పాకిస్థాన్‌లో జరగాల్సిన అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు రద్దవుతూ వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కరోనా కారణంగా ఆ దేశంలో జరగాల్సిన మరో సిరీస్ వాయిదా పడింది. ఇప్పటికే పాక్ పర్యటనలో ఉన్న విండీస్ జట్టులో కరోనా కేసులు నమోదవ్వడంతో ఇరు జట్ల మధ్య జరగాల్సిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ వచ్చే ఏడాది(2022) జూన్‌కు వాయిదా పడింది.
విండీస్ క్యాంపులో తాజాగా మరో ఐదుగురు(మొత్తం 9 మంది) కరోనా బారినపడడంతో ఇరు జట్లు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ), క్రికెట్ వెస్టిండీస్ (సీడబ్ల్యూఐ) గురువారం సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి. ఇదిలా ఉంటే, విండీస్ క్యాంప్‌లో గురువారం నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో 15 మంది ఆటగాళ్లకు నెగిటివ్ రిపోర్ట్ రావడంతో పాక్‌తో జరగాల్సిన మూడో టీ20 యధాతథంగా కొనసాగుతోంది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన విండీస్.. తొలుత బ్యాటింగ్‌కు దిగి నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోర్ చేసింది. బ్రెండన్ కింగ్(21 బంతుల్లో 43; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), బ్రూక్స్(31 బంతుల్లో 49; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), పూరన్(37 బంతుల్లో 64; 2 ఫోర్లు, 6 సిక్సర్లు), డారెన్ బ్రావో(27 బంతుల్లో 34 నాటౌట్; 3 ఫోర్లు) చెలరేగి ఆడారు. ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు నెగ్గిన పాక్ ఇదివరకే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది.
చదవండి: Ashes 2nd Test: ఇంగ్లండ్ బౌలర్ అరుదైన ఘనత..