ఐపీఎల్ 2024 వేలంలో ఓ అనామక ఆటగాడు భారీ ధర పలికాడు. జార్ఖండ్‌కు చెందిన 19 ఏళ్ల వికెట్‌కీపర్ బ్యాటర్ కుమార్ కుషాగ్రా కలలో కూడా ఊహించని ధరకు అమ్ముడుపోయాడు. అతన్ని ఢిల్లీ క్యాపిటల్స్ ఏకంగా 7.2 కోట్లకు కొనుగోలు చేసింది. కుషాగ్రాను దక్కించుకోవడం కోసం ఢిల్లీ క్యాపిటల్స్ చిన్న సైజు యుద్దమే చేసింది. ఈ యువ హిట్టర్ కోసం చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తీవ్రంగా పోటీపడ్డాయి.
ఈ వేలంలో 20 లక్షల బేస్ ధర విభాగంలో పేరును నమోదు చేసుకున్న కుషాగ్రా.. సమీర్ రిజ్వి తర్వాత అత్యధిక ధర పలికిన అన్ క్యాప్డ్ ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు. కుషాగ్రాకు ముందు సమీర్ రిజ్వికి సీఎస్‌కే 8.4 కోట్ల రికార్డు ధరకు సొంతం చేసుకుంది. ఈ వేలంలో మరో ఆటగాడు కూడా భారీ ధర పలికాడు. శుభమ్ దూబే అనే ఆటగాడిని రాజస్థాన్ రాయల్స్ 5.8 కోట్లు కొనుగోలు చేసింది. ఇవాల్టి వేలంలో ఢిల్లీ పెట్టిన అత్యధిక పెట్టుబడి కుషాగ్రాపైనే కావడం విశేషం.
కుషాగ్రా కెరీర్ విషయానికొస్తే.. చిన్నతనం నుంచి టీమిండియా దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోనిని చూస్తూ పెరిగిన ఈ యువ వికెట్‌కీపర్ బ్యాటర్ ధోనిలా ఎదగాలని కలలు కనే వాడట. ఈ విషయాన్ని కుషాగ్రా చాలా సందర్భాల్లో చెప్పాడు. 2021లో దేశవాలీ క్రికెట్‌లో అడుగుపెట్టిన కుషాగ్రా.. అంతకుముందు ఏడాది (2020) అండర్ 19 వరల్డ్‌కప్ జట్టుకు ఎంపికయ్యాడు.
2021-2022 సీజన్‌లో రంజీ జట్టుకు ఎంపికైన కుషాగ్రా.. నాగాలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీ డబుల్ సెంచరీ (288) బాది అందరి దృష్టి ఆకర్శించాడు. కుషాగ్రా తన స్వల్ప కెరీర్‌లో 3 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 2 లిస్ట్ ఏ మ్యాచ్‌లు, 2 టీ20లు ఆడాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో కుషాగ్రా సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment