సచిన్ దాస్.. ప్రస్తుతం భారత క్రికెట్‌లో మారుమోగుతున్న పేరు. అండర్ 19 వరల్డ్‌కప్-2024లో టీమిండియా ఫైనల్‌కు చేరడంలో ఈ యువ ఆటగాడిది కీలక పాత్ర. క్రికెట్ గాడ్ పేరు పెట్టుకున్న ఈ యువ సంచలనం.. అందుకు తగ్గట్టుగానే అసాధారణమైన ప్రతిభను కనబరుస్తున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి సెమీఫైనల్లో సచిన్ తనకు కెరీర్‌లో చిరకాలం గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు.
దక్షిణాఫ్రికా నిర్దేశించిన 244 పరగుల ఛేదనలో 32 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో కెప్టెన్ ఉదయ్ సహారన్‌తో జతకట్టిన సచిన్.. తన విరోచిత పోరాటంతో తొమ్మిదోసారి ఫైనల్‌కు చేర్చాడు. బౌలర్లకు అనుకూలిస్తున్న వికెట్‌పై సచిన్ దాస్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు.
కేవలం 4 పరుగుల దూరంలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయిన దాస్.. తన సంచలన ఇన్నింగ్స్‌తో మాత్రం అందరి ప్రశంసలను అందుకుంటున్నాడు. ఈ మ్యాచ్‌లో 95 బంతులు ఎదుర్కొన్న సచిన్ 11 ఫోర్లు, 1 సిక్స్‌తో 96 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో ఎవరీ సచిన్ దాస్ అని నెటిజన్లు అరాతీసున్నారు.
ఎవరీ సచిన్ దాస్?
సచిన్ దాస్.. 2005 ఫిబ్రవరి 3న మహారాష్ట్రలోని బీడ్ గ్రామంలో జన్మించాడు. సచిన్‌కు తన చిన్నతనం నుంచే క్రికెట్‌పై మక్కువ ఎక్కువ. నాలుగున్నర ఏళ్ల వయస్సు నుంచే సచిన్ క్రికెట్ ఆడడం మొదలెట్టాడు. కానీ అతడు ఉన్న చోట క్రికెట్ ఆడేందుకు అత్యుత్తమ సౌకర్యాలు లేవు. అతడు ప్రాక్టీస్ చేయడానికి పూర్తి స్ధాయి క్రికెట్ పిచ్‌లు కూడా అందుబాటులో ఉండేవి కాదు. దాస్ హాఫ్ టర్ఫ్‌లపైనే ప్రాక్టీస్ చేస్తూ వచ్చాడు.
సచిన్ తన ప్రయాణంలో ఎన్ని ఇబ్బందిలు ఎదుర్కొన్నప్పటికీ తన అభిరుచిని మాత్రం వదులుకోలేదు. నిరంతరం శ్రమ, పట్టుదలతో భారత జెర్సీ ధరించే స్ధాయికి చేరుకున్నాడు. అయితే సచిన్ భారత్ అండర్-19 క్రికెటర్‌గా ఎదగడంలో అతడి తల్లిదండ్రుల కూడా కీలక పాత్ర. సచిన్ తండ్రి పేరు సంజయ్ దాస్. అతడు మహారాష్ట్ర ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నారు. సంజయ్ దాస్‌కు కూడా క్రికెట్ అంటే ఇష్టం ఎక్కువే. యూనివర్సిటీ స్థాయి వరకు అతడు క్రికెట్ ఆడాడు. కానీ అతడు అంతకంటే ముందుకు వెళ్లలేదు.
అయితే తన కలను కొడుకు రూపంలో నెరవేర్చుకోవాలని అనుకున్నాడు. తనకు తనయడు జన్మించిన వెంటనే ఎలాగైనా క్రికెటర్ చేయాలని సంజయ్ నిర్ణయించుకున్నాడు. మరోవైపు సచిన్ తల్లిపేరు సురేఖ దాస్. మహారాష్ట్ర పోలీస్ విభాగంలో అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
కోచ్ కూడా..
అదే విధంగా సచిన్ ఈ స్ధాయికి చేరుకోవడంలో కోచ్ షేక్ అజార్ కూడా తన వంతు పాత్ర పోషించాడు. సచిన్‌కు పేస్ బౌలర్‌లకు ఆడటంలో కాస్త ఇబ్బంది పడుతూ వస్తుండేవాడు. ముఖ్యంగా బౌన్సర్లను ఎదుర్కొవడంలో ఇబ్బంది పడేవాడు. ఈ క్రమంలో సచిన్.. కోచ్ షేక్ అజార్ సాయంతో తన సమస్యను అధిగమించాడు. ఈ విషయాన్ని స్వయంగా అతడి తండ్రి సంజయ్ దాస్ తెలిపాడు.
సచిన్ దాస్ పేరు ఎలా వచ్చిందంటే?
సచిన్ దాస్ తండ్రి సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్‌కి వీరాభిమాని. అయితే తన ఆరాధ్య క్రికెటర్లలో ఒకరైన సచిన్ టెండూల్కర్ పేరును తన కొడుక్కి పెట్టుకున్నారు. అయితే 18 ఏళ్ల సచిన్ దాస్ కూడా టెండూల్కర్‌కు వీరాభిమాని. అందుకే మాస్టర్ బ్లాస్టర్ ధరించిన 10వ నంబర్ జెర్సీనే వరల్డ్‌కప్‌లో వేసుకుంటున్నాడు. ఓవరాల్‌గా ఈ టోర్నీలో 6 మ్యాచ్‌లు ఆడిన సచిన్ దాస్.. 73.50 సగటుతో 294 పరుగులు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment