భారత్‌లో స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లపై ఆడలేక గగ్గోలు పెట్టే ఆస్ట్రేలియన్లు.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా సిడ్నీలో జరిగిన చివరి టెస్ట్‌లో పేస్ బౌలింగ్ కి అనుకూలించిన పిచ్ పై మాత్రం మౌనం వహించారు. గత ఆదివారం ముగిసిన ఈ టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఆరు వికెట్ల తేడాతో పరాజయంపాలవ్వడంతో 1-3 తేడాతో ఆసీస్‌కు సిరీస్‌ను కోల్పోయింది.
ఈ నేపథ్యంలో ఓ ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు గళమెత్తడం అభినందనీయం. ఆస్ట్రేలియా మాజీ వికెట్‌కీపర్ టిమ్ పెయిన్ సిడ్నీ పిచ్ ని దుమ్మెత్తి పోయడం విశేషం."ఈ టెస్ట్ రెండున్నర రోజుల్లోనే ముగిసింది. ఏ జట్టూ 200 పరుగుల మార్కును చేరుకోలేదు. ఈ మ్యాచ్ కి ఉపయోగించిన పిచ్ ఉపరితలం బాగానే ఉంది. కానీ పగుళ్లు రావడంతో అస్థిరమైన బౌన్స్ తో బ్యాట్స్మన్ ఇబ్బంది పడ్డారు.
ఈ పిచ్‌పై బ్యాట్స్మన్‌లు వ్యక్తిగత నైపుణ్యం కంటే అదృష్టంపై ఎక్కువగా ఆధారపడినట్లు స్పష్టమైంది. ఈ పిచ్ కి అంతర్జాతీయ క్రికెట్ అధికారులు సంతృప్తికరమైన రేటింగ్ ఇచ్చినప్పటికీ, నేను మాత్రం దానికి సాధ్యమైనంత తక్కువ రేటింగ్ ఇస్తాను. వాళ్ళు మళ్ళీ ఇలాంటి పిచ్ ని రూపొందించినట్టయితే చర్యలు తప్పవని ఘాటుగా హెచ్చరించేవాడ్ని.
ఇలాంటి హెచ్చరిక వల్ల సిడ్నీ అధికారులు భవిష్యత్తులో ఇలాంటి పిచ్ ని తయారు చేయకుండా జాగ్రత్త వహిస్తారు. దీనివల్ల వాళ్ళు అలాంటి పిచ్ ని రూపొందించినట్టయితే అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెన్షన్ ఎదుర్కోవాల్సి ఉంటుందని కనీసం భయపడతారు" అని పెయిన్ తన కాలమ్‌లో రాశాడు.
"గతంలో ఐసిసి సిడ్నీ పిచ్ కు ‘సంతృప్తికరంగా’ రేటింగ్ ఇచ్చింది. ఇది రెండో అత్యధిక రేటింగ్ . సిడ్నీ పిచ్ అరిగిపోయి స్పిన్ బౌలింగ్ కి అనుకూలంగా మారే ముందు కొద్దిగా బౌన్స్ అవుతుంది. అయితే ఈ పిచ్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకు ఉత్తేజకరమైన ముగింపును అందించింది. ఇది వచ్చే సీజన్ లో జరిగే యాషెస్ సిరీస్ కి శుభసూచకమని," క్రికెట్ ఆస్ట్రేలియా క్రికెట్ ఆపరేషన్స్ అండ్ షెడ్యూలింగ్ హెడ్ పీటర్ రోచ్ అన్నారు.
స్వదేశం లో సిరీస్ లు జరిగినప్పుడు ఆతిధ్య జట్లు పిచ్ లు తమ బౌలర్లకు అనుకూలంగా రూపాందించుకోవడం ఆనవాయితీ. అయితే విదేశీ పర్యటనలకు వచినప్పుడు మాత్రం వాళ్ళ ఆటగాళ్లు విఫలమైనప్పుడు ఆతిధ్య జట్టు పై దుమ్మెత్తి పోయడం మాత్రం సరికాదు. ఇది ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి జట్లు గుర్తుంచుకోవాలి!
Comments
Please login to add a commentAdd a comment