ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్-2022 టోర్నీలో భారత్ ప్రయాణం ముగిసింది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో మిథాలీ సేన 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దీంతో గత వరల్డ్‌కప్ రన్నరప్ భారత మహిళా జట్టు ఈసారి కనీసం సెమీస్ కూడా చేరకుండానే నిష్క్రమించింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న 274 పరుగుల భారీ స్కోరు చేసినా దురదృష్టం వెంటాడింది. ఇక ఆదిలో దక్షిణాఫ్రికా వికెట్ తీసిన ఆనందం అంతలోనే ఆవిరైపోగా.. 26వ ఓవర్ తర్వాత వికెట్లు పడటం ఊరటనిచ్చింది. ముఖ్యంగా 48 పరుగులతో రాణించిన భారత జట్టు వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ బంతితోనూ అద్భుతం చేయడం అభిమానుల్లో ఉత్సాహం నింపింది. మొత్తంగా 8 ఓవర్లు బౌలింగ్ వేసిన హర్మన్ 2 వికెట్లు కూల్చింది.
అంతేగాక మూడు రనౌట్లలో భాగమైంది. ఆమె అద్భుత ప్రదర్శనతో భారత శిబిరంలో ఆశలు చిగురించాయి. అయితే, చివర్లో దీప్తి శర్మ నోబాల్ భారత్ కొంపముంచింది. ఆఖరి బంతికి దక్షిణాఫ్రికా బ్యాటర్ మిగ్నన్ డు ప్రీజ్ సింగిల్ తీసి మిథాలీ సేన సెమీస్ ఆశలపై నీళ్లు చల్లింది. అయితే, దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఓటమి వెస్టిండీస్‌కు వరంగా మారింది.
కాగా అంతకు ముందు గురువారం జరగాల్సిన దక్షిణాఫ్రికా- వెస్టిండీస్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. దీంతో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లకు చెరో పాయింట్ లభించింది. ఈ క్రమంలో 7 పాయింట్లతో వెస్టిండీస్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. ఇక ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయంతో ఇంగ్లండ్ గెలుపొంది సెమీస్ చేరింది. విండీస్‌ను వెనక్కినెట్టింది.
ఇదిలా ఉంటే.. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైన కారణంగా టాప్-4లోకి చేరలేకపోయింది. దీంతో మిథాలీ సేన సెమీస్ నుంచి నిష్క్రమించగా.. విండీస్ సెమీ ఫైనల్‌లో అడుగుపెట్టింది. దీంతో వెస్టిండీస్ జట్టులో ఆనందాలు వెల్లివిరిశాయి.
Comments
Please login to add a commentAdd a comment