మహిళల టీ20 వరల్డ్‌కప్-2023లో పాక్ బ్యాటర్ మునీబా అలీ రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ టీ20ల్లో పాక్ తరఫున తొలి శతకం బాదిన మహిళా క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కింది. అలాగే ప్రపంచకప్ టోర్నీల్లో సెంచరీ సాధించిన ఏడో మహిళా క్రికెటర్‌గా రికార్డుల్లో నిలిచింది. ఇప్పటివరకు జరిగిన ఏడు మహిళల టీ20 వరల్డ్‌కప్ ఎడిషన్లలో డియాండ్ర డొట్టిన్, మెగ్ లాన్నింగ్, హర్మన్‌ప్రీత్ కౌర్, హీథర్ నైట్, లిజెల్ లీ సెంచరీ సాధించగా.. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో శతక్కొట్టడం ద్వారా మునీబా వీరి సరసన చేరింది. ఈ మ్యాచ్‌కు ముందు వరకు కనీసం హాఫ్‌సెంచరీ కూడా చేయని మునీబా ఏకంగా శతకాన్నే బాది ఔరా అనిపించింది. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో మునీబా సాధించిన సెంచరీనే తొలి సెంచరీ కావడం విశేషం.
మ్యాచ్ విషయానికొస్తే.. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ మునీబా సెంచరీ (68 బంతుల్లో 102; 14 ఫోర్లు) సాయంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 165 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ స్కోర్ ప్రస్తుత వరల్డ్‌కప్‌లో రెండో అత్యధిక టీమ్ స్కోర్‌గా రికార్డైంది. మునీబాతో పాటు నిదా దార్ (33) రాణించింది. ఐర్లాండ్ బౌలర్లలో అర్లెన్ 2, లియా పాల్ ఓ వికెట్ పడగొట్టారు.
166 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఐర్లాండ్.. 16.3 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూలి 70 పరుగుల తేడాతో దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. పాక్ బౌలర్లలో నష్రా సంధూ 4 వికెట్లతో చెలరేగగా.. సాదియా ఇక్బాల్, నిదా దార్ తలో 2 వికెట్లు, ఫాతిమా సనా, టుబా హసన్ చెరో వికెట్ పడగొట్టారు. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో ఓర్లా (31), ఎయిమర్ రిచర్డ్‌సన్ (28), గాబీ లివిస్ (10) మాత్రమే రెండంకెల స్కోర్ సాధించారు. వరల్డ్‌కప్‌లో ఇవాల్టి (ఫిబ్రవరి 16) మ్యాచ్‌లో శ్రీలంక, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment