సౌతాంప్టన్: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగనున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ టికెట్ల ధరలు ఆకాశానంటుతున్నాయి. జూన్ 18-22 మధ్య సౌతాంప్టన్ వేదికగా జరుగబోయే ఈ మెగా పోరును ప్రత్యక్షంగా వీక్షించేందుకు అభిమానులు ఎగబడుతుండడమే ఇందుకు కారణం. పరిమిత సంఖ్యలో టిక్కెట్లు ఉండటంతో ఒక్కో టికెట్ ధర భారత కరెన్సీ ప్రకారం ఏకంగా రెండు లక్షల రూపాయల వరుకు పలుకుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్‌కు పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను అనుమతించాలని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్(ఈసీబీ) ఇదివరకే ప్రకటించింది. దీనికి సంబంధించి ఈసీబీ తాజాగా మరో ప్రకటన చేయడంతో టిక్కెట్ల ధరలకు రెక్కలొచ్చాయి.
ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్ కు కేవలం 4 వేల మంది ప్రేక్షకులను మాత్రమే అనుమతిస్తామని ఆతిధ్య హాంప్‌షైర్ కౌంటీ క్లబ్ ప్రకటించింది. ఇందులో ఐసీసీ స్పాన్సర్లు, వాటాదారులకు 50 శాతం టికెట్లు ఇస్తామని.. మిగిలిన 2000 టికెట్లను మాత్రమే అమ్మకానికి ఉంచుతామని హాంప్ షైర్ క్లబ్ హెడ్ రోడ్ బ్రన్స్ గ్రోవ్ తెలిపడంతో అభిమానులు టికెట్లకోసం ఎగబడుతున్నారు.
కాగా, 2019 సెప్టెంబర్ తర్వాత ఇంగ్లండ్ మైదానాల్లోకి ఫ్యాన్స్‌ను అనుమతించడం ఇదే తొలిసారి కావడంతో డబ్ల్యూటీసీ ఫైనల్‌కు డిమాండ్ పెరిగింది. క్రికెట్ మ్యాచ్‌లు చూసి చాలా రోజులు కావడంతో సహజంగానే అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో టిక్కెట్లు బ్లాక్ మార్కెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే, ప్రపంచ టెస్ట్ ఛాంపియషిప్ ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో జరిగే ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం భారత జట్టు జూన్ 2న ప్రత్యేక విమానంలో యూకేకు బయల్దేరుతుంది. ఇప్పటికే జట్టు సభ్యులతో పాటు వారివారి కుటుంబ సభ్యులు, సహాయ సిబ్బంది ముంబైలో క్వారంటైన్ లో ఉన్నారు.
చదవండి: పంత్‌కు క్రికెట్ దిగ్గజం వార్నింగ్..
Comments
Please login to add a commentAdd a comment