
టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ)లో ఆస్ట్రేలియా క్రికెటర్ నాథన్ లియోన్ పేరిట ఉన్న రికారుర్డు బద్దలు కొట్టాడు. డబ్ల్యూటీసీలో అత్యధిక వికెట్ల వీరుడిగా అవతరించాడు.
న్యూజిలాండ్‌తో రెండో టెస్టు సందర్భంగా అశ్విన్ ఈ అరుదైన ఘనత సాధించాడు. కాగా డబ్ల్యూటీసీ 2023-25 సీజన్‌లో భాగంగా మూడు టెస్టులు ఆడేందుకు కివీస్ జట్టు భారత పర్యటనకు వచ్చింది. బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టులో పర్యాటక న్యూజిలాండ్ టీమిండియాను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది.
తొలుత నాథన్ లియోన్ రికార్డు సమం చేసి
ఈ క్రమంలో భారత్- కివీస్ మధ్య పుణె వేదికగా గురువారం రెండో టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, కెప్టెన్, ఓపెనర్ టామ్ లాథమ్(15)ను ఆదిలోనే పెవిలియన్‌కు పంపాడు రవిచంద్రన్ అశ్విన్. కివీస్ ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్ ఆఖరి బంతికి లాథమ్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.
కాగా డబ్ల్యూటీసీలో అశూకు ఇది 187వ వికెట్. తద్వారా డబ్ల్యూటీసీలో అత్యధిక వికెట్ల వీరుడిగా ఉన్న ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియోన్ రికార్డును సమం చేశాడు. అయితే, కాసేపటికే లియోన్‌ను అధిగమించాడు అశూ. 24వ ఓవర్లో కివీస్ మరో వన్‌డౌన్ బ్యాటర్ విల్ యంగ్‌ను అవుట్ చేశాడు.
లీడింగ్ వికెట్ టేకర్‌గా అవతరించి
ఈ క్రమంలో 188 వికెట్లతో అశ్విన్ డబ్ల్యూటీసీ లీడింగ్ వికెట్ టేకర్‌గా అవతరించాడు. ఇక మొదటి రోజు ఆటలో భోజన విరామ సమయానికి న్యూజిలాండ్ 31 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. ఓపెనర్ డెవాన్ కాన్వే 47, రచిన్ రవీంద్ర 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో అశ్విన్‌కు రెండు వికెట్లు దక్కాయి.
చదవండి: IND Vs NZ 2nd Test: న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్.. టీమిండియాలో మూడు మార్పులు
Comments
Please login to add a commentAdd a comment