![You Wasted Opportunity: Zaheer Khan Delivers Blunt Verdict On Shreyas Iyer - Sakshi](/styles/webp/s3/article_images/2024/02/7/iyer.jpg.webp?itok=oxmH9mDb)
Ind vs Eng Test series 2024: ఇంగ్లండ్‌తో టెస్టుల్లో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఆట తీరును భారత మాజీ బౌలర్ జహీర్ ఖాన్ విమర్శించాడు. వరుసగా అవకాశాలు ఇచ్చినా.. వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. తొందరపాటు చర్యలతో అనవసరంగా వికెట్ పారేసుకుంటున్నాడని జహీర్ పేర్కొన్నాడు.
కాగా ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు రంజీ ట్రోఫీ-2024లో ఆడిన ముంబై బ్యాటర్ శ్రేయస్ అయ్యర్.. ఫామ్‌లోకి వచ్చినట్లే కనిపించాడు. కానీ తొలి రెండు టెస్టుల్లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు.
హైదరాబాద్‌లో కేవలం 48 పరుగులకే పరిమితమైన ఈ కుడిచేతి వాటం బ్యాటర్... విశాఖపట్నంలోనూ వైఫల్యాన్ని కొనసాగించాడు. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 56 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ రెండు సందర్భాల్లోనూ ఒక్కసారి కూడా జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు.
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్.. శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ తీరును విమర్శిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కోగలిగే సత్తా ఉండి కూడా అనసరపు షాట్లకు పోయి విశాఖలో వికెట్ సమర్పించుకున్నాడంటూ పెదవి విరిచాడు.
ఎందుకంత తొందర?
‘‘జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నపుడు మనం ఎలాంటి పాత్ర పోషించాలన్న అంశం మీద పూర్తి అవగాహన కలిగి ఉండాలి. శ్రేయస్ అయ్యర్ మాత్రం ఇవేమీ పట్టనట్టు కనిపించాడు. ఆండర్సన్ అప్పటికే తన స్పెల్ పూర్తి చేశాడు.
ప్రత్యర్థి జట్టులో ఒక్క ఫాస్ట్ బౌలర్ మాత్రమే ఉన్నాడు. అతడి తర్వాత స్పిన్నర్లు అటాకింగ్‌కు వస్తారని తెలుసు. నిజానికి అయ్యర్ స్పిన్ ఆడటంలో టాప్ క్లాస్ బ్యాటర్. అయినా కూడా.. తొందరపడ్డాడు.
స్పిన్నర్లపై ఆధిపత్యం చెలాయించాలనే తొందరలో తనకు మేనేజ్‌మెంట్ ఇచ్చిన అవకాశాన్ని వృథా చేసుకున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్నపుడు ఆదుకోలేకపోయాడు’’ అని జహీర్ ఖాన్ అయ్యర్‌కు చురకలు అంటించాడు.
వేటు తప్పదు
కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి తిరిగి వస్తే ఇంగ్లండ్‌తో మిగిలిన టెస్టుల్లో సెలక్టర్లు శ్రేయస్‌కు ఉద్వాసన పలకడం ఖాయమని జహీర్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. కాగా గతేడాది కాలంగా టెస్టుల్లో శ్రేయస్ అయ్యర్ ఒక్క అర్ధ శతకం కూడా సాధించలేకపోయాడు. వరుస అవకాశాలు ఇస్తున్నా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు.
ఇక విశాఖపట్నం మ్యాచ్‌లో సెకండ్ ఇన్నింగ్స్‌లో మంచి ఆరంభమే అందుకున్నా ఇంగ్లండ్ స్పిన్నర్ టామ్ హార్లీ బౌలింగ్‌లో తొందరపడి వికెట్ పారేసుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా- ఇంగ్లండ్ ప్రస్తుతం చెరో విజయంతో 1-1తో సమంగా ఉన్న విషయం తెలిసిందే.
చదవండి: SAT20 League 2024: సన్‌రైజర్స్ పేసర్ సంచలనం.. ఫైనల్ చేరిన డిఫెండింగ్ చాంపియన్
Comments
Please login to add a commentAdd a comment