లోక్‌సభ ఎన్నికల్లో పోటీ?.. స్పందించిన యువరాజ్‌ సింగ్‌ | Yuvraj Singh Breaks Silence On Reports Claiming He Will Contesting Lok Sabha Elections | Sakshi
Sakshi News home page

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ?.. స్పందించిన యువరాజ్‌ సింగ్‌

Published Sat, Mar 2 2024 12:23 PM | Last Updated on Sat, Mar 2 2024 1:02 PM

Yuvraj Singh Breaks Silence On Reports Claiming Contesting Lok Sabha Elections - Sakshi

తన రాజకీయ రంగ ప్రవేశం గురించి వస్తున్న వార్తలపై టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ స్పందించాడు. ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయాలు ఒక్కటే మార్గం కాదని.. తన ఫౌండేషన్‌ ద్వారా వీలైనన్ని సేవా కార్యక్రమాలు చేపడతానని యువీ పేర్కొన్నాడు.

తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశాడు. కాగా బీజేపీ తరఫున యువరాజ్‌ సింగ్‌ ఎన్నికల బరిలో దిగుతాడని వార్తలు వినిపించాయి. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌ నియోజకవర్గం నుంచి యువీ లోక్‌సభకు పోటీ చేయనున్నాడంటూ ప్రచారం జరిగింది.

సాయం చేయడం అంటే ఇష్టం
సిట్టింగ్‌ ఎంపీ, నటుడు సన్నీ డియోల్‌ స్థానంలో అతడికి బీజేపీ టికెట్‌ ఇస్తోందంటూ.. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో యువీ దిగిన ఫొటో నెట్టింట వైరల్‌ అయింది. అయితే, ఇవన్నీ వట్టి పుకార్లేనని యువరాజ్‌ సింగ్‌ కొట్టిపారేశాడు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ.. ‘‘మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం.

నేను గురుదాస్‌పూర్‌ నుంచి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. కష్టాల్లో ఉన్నవారికి చేతనైనంత సాయం చేయడం, వారికి మద్దతుగా నిలవడం నాకు ఇష్టం. అందుకోసం నా ఫౌండేషన్‌ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాను. 

ఈ ప్రయాణాన్ని ఇలాగే కొనసాగిస్తాను. గొప్ప మార్పు తెచ్చేందుకు నా వంతు ప్రయత్నంలో మీరూ భాగం కండి’’ అని యువీ తన అభిమానులకు పిలుపునిచ్చాడు.

దిగ్గజ ఆల్‌రౌండర్‌గా
కాగా భారత క్రికెట్‌లో దిగ్గజ ఆల్‌రౌండర్లలో ఒకడిగా పేరొందిన యువరాజ్‌ సింగ్‌.. 2007 టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీలో ఒకే ఓవర్లో వరుసగా ఆరు సిక్సర్లు బాదిన తీరు చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు.

అదే విధంగా టీమిండియా 2011లో వన్డే ప్రపంచకప్‌ గెలవడంలోనూ యువీది కీలక పాత్ర. ఆల్‌రౌండర్‌ ప్రతిభతో అదరగొట్టి నాటి ఐసీసీ ఈవెంట్లో ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌ అవార్డు అందుకున్నాడు.

ఈ క్రమంలో క్యాన్సర్‌ బారిన పడ్డ యువీ కోలుకున్న తర్వాత తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాడు. ఇక 2019లో క్రికెట్‌కు వీడ్కోలు పలికిన యువీ ప్రస్తుతం తన ఫౌండేషన్‌ కార్యక్రమాలతో బిజీగా ఉన్నాడు. భార్య హాజిల్‌ కీచ్‌, కుమారుడు ఓరియాన్‌, కుమార్తె ఆరాతో కలిసి సమయం గడుపుతున్నాడు.

చదవండి: Gautam Gambhir: గంభీర్‌ సంచలన ప్రకటన.. బీజేపీకి గుడ్‌బై!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement