జింబాబ్వే క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్ పరిస్థితి విషమంగా ఉందని ఆ దేశ మీడియాలో ప్రసారమవుతున్న కథనాల ద్వారా తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆ దేశ మాజీ క్రీడల మంత్రి డేవిడ్ కోల్టార్ట్ సైతం ట్విట్టర్‌లో షేర్ చేశారు. స్ట్రీక్ కోలుకుని, తిరిగి మామూలు మనిషి అయ్యేందుకు ప్రార్థించాలని ఆయన తన దేశ ప్రజలకు, దేశం వెలుపల ఉన్న ప్రార్ధన యోధులకు పిలుపునిచ్చారు.
జింబాబ్వేకు పాత్రినిధ్యం వహించిన గొప్ప క్రికెటర్లలో ఒకరైన హీత్ స్ట్రీక్ తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని, అతనికి మనందరి ప్రార్ధనలు చాలా అవసరమని డేవిడ్ కోల్టార్ట్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. స్ట్రీక్ కోసం, అతని కుటుంబం కోసం ప్రార్ధించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం స్ట్రీక్ సౌతాఫ్రికాలో ఉన్నట్లు సమాచారం.
కాగా, జింబాబ్వే ఆల్‌టైమ్ గ్రేట్ ఆల్‌రౌండర్లలో ఒకరైన స్ట్రీక్ 1993లో ఆ దేశం తరఫున అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించి 65 టెస్ట్‌లు (216 వికెట్లు, సెంచరీ, 11 హాఫ్ సెంచరీలు), 189 వన్డేలు (239 వికెట్లు, 13 హాఫ్ సెంచరీలు) ఆడాడు. అతను తన చివరి మ్యాచ్‌ను 2005లో ఆడాడు. స్ట్రీక్ 21 టెస్ట్‌ల్లో, 68 వన్డేల్లో జింబాబ్వే కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. 2021లో స్ట్రీక్ అవినీతికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొని, ఎనిమిదేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిషేధానికి గురయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment