
తలకు తీవ్రగాయమై యువకుడి మృతి
నెల్లూరు(క్రైమ్): పక్కనున్న మిద్దైపె పడి తలకు తీవ్ర గాయమై యువకుడు మృతి చెందిన ఘటన నగరంలోని కొరడావీధిలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన సుబ్రత సమంత ఉపాధి నిమిత్తం నగరానికి పదేళ్ల క్రితం వచ్చి కోటమిట్టకు చెందిన అన్వర్‌బాషా వద్ద బంగారు ఆభరణాల తయారీ పనులు చేసుకుంటూ కొరడావీధిలో నివసిస్తున్నారు. ఈయన చిన్నాన్న కుమారుడు సునీల్ సమంత (27) నెల్లూరుకు ఎనిమిదేళ్ల క్రితం వచ్చి కొరడావీధిలోని మొహిద్దీన్ వద్ద బంగారు పనులు చేస్తున్నారు. సమీపంలో ఉన్న సురేంద్ర కాంప్లెక్స్‌లోని నాలుగో అంతస్తులో గల పెంట్‌హౌస్‌లో స్నేహితులు జయంత్, జయంత్‌గైన్‌తో కలిసి ఉంటున్నారు. ఈ ముగ్గురూ ఆదివారం అర్ధరాత్రి వరకు మద్యం సేవించారు. అనంతరం భోజనం చేసేందుకు లోపలికి వీరు వెళ్లగా, సునీల్ సమంత బయటే ఉన్నారు. ఈ తరుణంలో పక్కనే ఉన్న మిద్దైపె సునీల్‌సమంత పడ్డారు. శబ్దం రావడంతో బయటకు పరుగులు తీసిన స్నేహితులు జరిగిన విషయాన్ని స్థానికంగా ఉన్న దస్తగిరి ద్వారా సుబ్రత సమంతకు తెలియజేశారు. ఘటన స్థలానికి హుటాహుటిన ఆయన చేరుకున్నారు. తలకు తీవ్రగాయమై అపస్మారక స్థితిలో ఉండటంతో 108కు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న వారు పరిశీలించి అప్పటికే మృతి చెందారని నిర్ధారించారు. ఈ మేరకు సంతపేట పోలీసులకు మృతుడి సోదరుడు ఫిర్యాదు చేశారు. ఎస్సై సుల్తాన్‌బాషా ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. అనంతరం కుటుంబసభ్యులకు మృతదేహాన్ని అప్పగించడంతో తమ స్వస్థలానికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment