
ఉపాధి పనుల్లో రూ.3.70 కోట్ల అవినీతి
ఉదయగిరి: మండలంలో జరిగిన ఉపాధి పనుల్లో భారీగా అవినీతి జరిగిందని సోషల్ ఆడిట్ తనిఖీల్లో నిగ్గు తేల్చితే.. చివరకు అధికారులు ఈ మొత్తాన్ని కుదించి పది శాతానికి తగ్గించారు. ఆయా పనుల్లో అవినీతి, అక్రమాలకు పాల్పడిన 16 మంది అధికారులు, సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడిదంటే.. ఏ స్థాయిలో అవినీతి జరిగిందో ఈ చర్యలే అద్దం పడుతున్నాయి. ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో మంగళవారం 17వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. 2023 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు మండలంలో ఉపాధి హామీ పథకం కింద రూ.14.08 కోట్ల పనులు చేపట్టారు. వాటికి సంబంధించి క్షేత్రస్థాయిలో సామాజిక తనిఖీ బృందాలు తనిఖీ చేయగా బినామీ మస్తర్లు, చనిపోయిన వారి పేర్లతో నగదు స్వాహా, పనుల్లో కొలతల్లో తేడా, డబుల్ జాబ్‌కార్డులు, అవెన్యూ ప్లాంటేషన్‌లో అవినీతి, రికార్డులు మాయం చేయడం, ఉద్యోగులు, వలంటీర్ల పేరుతో మస్తర్లు, ఒకే కుటుంబంలో వివిధ జాబ్‌కార్డులు సృష్టించడం, నేమ్‌బోర్డు లేకుండానే నిధులు స్వాహా, తదితర అవినీతి అక్రమాలు గుర్తించారు. మండలంలోని 17 పంచాయతీల్లో రూ.3.70 కోట్ల మేర అవినీతి జరిగినట్లుగా లెక్క తేల్చారు. డ్వామా పీడీ గంగాభవాని సమక్షంలో జరిగిన ప్రజా వేదికలో సామాజిక తనిఖీ బృందం పంచాయతీల వారీగా జరిగిన అవినీతి, అక్రమాలను బయటపెట్టారు. అయితే అటు చేసి.. ఇటు చేసి రూ.37.80 లక్షల అవినీతి జరిగినట్లుగా లెక్క తేల్చారు. మరో రూ.98 లక్షలకు సంబంధించి రికార్డులు మాయం కావడంతో అందుకు బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేయాల్సిందిగా ఎంపీడీఓ అప్పాజీని డ్వామా పీడీ ఆదేశించారు. ఈ అవినీతి, అక్రమాల్లో ప్రమేయమున్న ఏపీఓ శ్రీనివాసులు, ఈసీలు వెలుగోటి శ్రీనివాసులు, మురళీకృష్ణ, కంప్యూటర్ ఆపరేటర్లు సుహాసిని, రిఫీ, టెక్నికల్ అసిస్టెంట్లు మనోజ్, రామకృష్ణ, కాలె శ్రీనివాసులుతోపాటు 9 మంది క్షేత్ర సహాయకులను సస్పెండ్ చేస్తూ పీడీ ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అంబుడ్స్‌మెన్ వెంకటరెడ్డి, జిల్లా విజిలెన్స్ అధికారిణి విజయలక్ష్మి, జిల్లా క్వాలిటీ కంట్రోల్ అధికారి సతీష్‌బాబు, ఇన్‌చార్జి ఏపీడీ శంకరనారాయణ, ఎంపీడీఓ అప్పాజీ తదితరులు పాల్గొన్నారు.
రికవరీకి ఆదేశించిన మొత్తాలు
ఉదయగిరిలో రూ.2,98,788, కొండాయపాళెం రూ.2,61,763, పుల్లాయపల్లి రూ.9,28,320, ఆర్లపడియ రూ.4,14,074, బండగానిపల్లి రూ.1,53,811, దాసరపల్లి రూ.17,200, శకునాలపల్లి రూ.41,147, నేలటూరు రూ.29,400, తిరుమలాపురం రూ.2,71,774, వెంగళరావునగర్ రూ.2,31,071, జి.అయ్యవారిపల్లి రూ.2,42,066, జి.చెరువుపల్లి రూ.78,011, గండిపాళెం రూ.61,427, జి.చెర్లోపల్లి రూ.2,252, అప్పసముద్రం రూ.5,40,000, కృష్ణంపల్లి రూ.2,72,064, గన్నేపల్లి రూ.2,500 అవినీతి జరిగినట్లుగా తేల్చి రికవరీకి ఆదేశించారు.
రికవరీకి ఆదేశించిన మొత్తం రూ.37.80 లక్షలే
16 మంది ఉపాధి సిబ్బంది,
అధికారులపై సస్పెన్షన్ వేటు