రుణాల మంజూరులో భాగస్వాములవ్వాలి
నెల్లూరు రూరల్: ఎమ్మెస్సెమ్‌ఈ రుణాలతో అన్ని రంగాల ఆర్థిక పరిపుష్టి సాధ్యమని, వీటి మంజూరులో ప్రైవేట్ బ్యాంకర్లు భాగస్వాములు కావాలని జేసీ కార్తీక్ కోరారు. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో బుధవారం నిర్వహించిన జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. లబ్ధిదారులకు రుణాల మంజూరులో ప్రైవేట్ బ్యాంకర్లు వెనుకబడి ఉన్నారని చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలుకు సహకారాన్ని అందించి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముద్ర యోజన, పీఎంఈజీపీ, ఎమ్మెస్సెమ్‌ఈ రుణాల మంజూరుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు రుణాలను విరివిగా ఇవ్వాలన్నారు. గ్రామాల్లో లబ్ధిదారులతో నిర్వహించే అవగాహన సదస్సులకు బ్యాంక్ అధికారులు హాజరుకావాలని సూచించారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్న తరుణంలో రైస్ మిల్లర్లకు బ్యాంక్ గ్యారెంటీలను త్వరగా మంజూరు చేయాలని కోరారు. అనంతరం లీడ్ డిస్ట్రిక్ట్ బ్యాంక్ మేనేజర్ శ్రీకాంత్ ప్రదీప్ మాట్లాడారు. ఈ త్రైమాసికానికి సంబంధించిన రుణాల మంజూరులో మంచి ఫలితాలను సాధించామని చెప్పారు. నాబార్డు డీడీఎం బాబు, మేనేజర్ రాజేష్, పశుసంవర్థక, మత్స్యశాఖ జేడీలు రమేష్‌నాయక్, నాగేశ్వరరావు, ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు, బీసీ కార్పొరేషన్ ఈడీ నిర్మలాదేవి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment