కామధేనులో మూగరోదన | - | Sakshi
Sakshi News home page

కామధేనులో మూగరోదన

Published Thu, Mar 20 2025 12:16 AM | Last Updated on Thu, Mar 20 2025 12:16 AM

కామధే

కామధేనులో మూగరోదన

కలవరపెడుతున్న బ్రూసెల్లోస్‌ వ్యాధి

అధికారిక లెక్కల మేరకు 120 గోవులు, గేదెలకు బ్రూసెల్లోస్‌ వ్యాఽధి సోకింది. వీటిని వేరు చేసి ప్రత్యేకంగా ఉంచారు. ఇది సోకితే నయమయ్యే అవకాశం లేకపోవడంతో ఆహారం, దాణాను తగ్గిస్తున్నారు. దీంతో అనేక మూగజీవాలు చిక్కిశల్యమవుతున్నాయి. ప్రత్యేక షెడ్‌లో ఉండాల్సిన వీటిలో ప్రస్తుతం 47 మాత్రమే ఉన్నాయి. మిగిలిన వాటి సంగతి ఏమిటని ప్రశ్నిస్తే అధికారుల నుంచి సమాధానం లేదు. మరణిస్తే రికార్డుల్లో నమోదు చేయాలి, అయితే గుట్టుచప్పుడు కాకుండా వీటిని విక్రయించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జేసీ కార్తీక్‌ ఇటీవల పర్యటించి ఈ అంశమై అఽధికారుల నుంచి నివేదిక కోరారు. అవసరం లేకపోయినా కొన్ని సాహివాల్‌ ఆవులు, ముర్రాజాతి గేదెలను కొనుగోలు చేసి కమీషన్లు కోసం నిధులు వెచ్చించారనే ఆరోపణలున్నాయి. ఏళ్ల తరబడి అధికారులు ఇక్కడే తిష్ట వేయడంతో పలు అక్రమాలకు పాల్పడుతున్నారని సిబ్బందే పేర్కొంటున్నారు. సమగ్ర విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కాగా ఈ విషయమై కామధేను ప్రాజెక్ట్‌ జేడీ, వెంకటేష్‌ ను సంప్రదించగా, ప్రాజెక్ట్‌ సీఈఓ, గుంటూ రు, శ్రీనివాసరావు ఆదేశాల మేరకు నడు చుకుంటున్నామని చెప్పారు. అనుమానాలు ఉంటే ఆయన్నే సంప్రదించాలని సూచించారు. మరికొన్ని ప్రశ్నలు అడగ్గా, మౌనం వహించారు.

ఉదయగిరి / కొండాపురం: కొండాపురం మండలంలోని చింతలదేవి క్షేత్రంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన జాతీయ కామధేను పునరుత్పత్తి కేంద్రంలో పశువులు మూగవేదనను అనుభవిస్తున్నాయి. సరైన ఆహారం అందక బక్కచిక్కిపోతున్నాయి. దేశంలో ఉన్న వివిధ రకాల ఆవులు, గేదెల పిండోత్పత్తి చేసి రైతులకు మేలు జాతి సంపదను అందించాలనేది ఈ కేంద్ర ఆశయం. ఇంతటి ప్రాధాన్యమైన ఈ ప్రాజెక్ట్‌ నిర్వహణను ప్రభుత్వం గాలికొదిలేసింది. ఇక్కడి పశువులకు అహారం, నీళ్లు, తగిన వసతులు, మెరుగైన వైద్యం అందక మూగరోదనను అనుభవిస్తున్నాయి.

విడుదలకు నోచుకోని వాటా..

2015లో రూ.36.12 కోట్ల అంచనా వ్యయంతో కామధేను ప్రాజెక్ట్‌ మంజూరైంది. దీనికి కేంద్ర ప్రభుత్వం తన వాటాగా రూ.25 కోట్లను మంజూరు చేయగా, రాష్ట్ర వాటాగా రూ.11.12 కోట్లను విడుదల చేయలేదు. ఈ పరిణామంతో కేంద్రమిచ్చిన నిధులతోనే పనులు జరుగుతున్నాయి. చింతలదేవి పశుగణాభివృద్ధి క్షేత్రంలో 2448 ఎకరాలుండగా, ఇందులో 510 ఎకరాలను దీని కోసం కేటాయించారు. ఇందులో పదెకరాల్లో పశువులు, గోవులకు అవసరమైన నిర్మాణాలు, పరిపాలన భవనాలను నిర్మించారు. పశుగ్రాసానికి 500 ఎకరాలను కేటాయించారు. అయితే ఇక్కడ నీటి పారుదలకు సదుపాయం లేకపోవడంతో వేసవిలో పశుగ్రాస కొరత వెంటాడుతోంది. రాళ్లపాడు ప్రాజెక్ట్‌ నుంచి నీటి సరఫరా కోసం నిధులు మంజూరై కొంతమేర పనులూ జరిగాయి. అయితే అక్కడి నుంచి నీటిని తీసుకునేందుకు ప్రకాశం జిల్లా ప్రజాప్రతినిధులు అభ్యంతరం తెలపడంతో నిలిచిపోయాయి.

ఇదీ ప్రాజెక్ట్‌ నేపథ్యం..

ఇక్కడి ప్రాజెక్ట్‌లో దేశంలోని 14 రకాల దేశవాళీ ఆవులు, ఆరు రకాల గేదెలున్నాయి. వీటి ద్వారా మేలు జాతి ఆవులు, గేదెలను పునరుత్పత్తి చేసి రైతులకు అందించాలని, తద్వారా పాల దిగుబడి పెరిగి పశుపోషకుల జీవన ప్రమాణాలు వృద్ధి చెందుతాయనేది లక్ష్యం. దీని కోసం ప్రత్యేకమైన ల్యాబ్‌నూ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇక్కడ 14 రకాలకు చెందిన 317 ఆవులు, ఆరు రకాలకు చెందిన 138 గేదెలున్నాయి. వీటికి తోడు మరో 70 వరకు దూడలూ ఉన్నాయి.

నిర్లక్ష్యానికి పరాకాష్ట

అభివృద్ధి చేసిన పిండాన్ని ఆవు గర్భంలో ప్రవేశపెట్టి వాటి ద్వారా మేలుజాతి సంతతిని రైతులకు అందించాల్సి ఉంది. అయితే ఈ విధానంలో 11 మాత్రమే జన్మించాయి. వాస్తవానికి వందలాది మంది రైతులకు ఈ ప్రయోజనం చేకూరాలి. అయితే అధికారుల నిర్లక్ష్య ధోరణితో ఇది జరగడంలేదు. ఐవీఎఫ్‌ – వీటీటీ ల్యాబ్‌కు చెందిన డాక్టర్‌ ఇక్కడ జీతం తీసుకుంటూ చుట్టపు చూపుగా వస్తుండటంతో ఆశించిన ప్రగతి లేదు.

అర్థాకలి..

ఈ ప్రాజెక్ట్‌ మారుమూల ప్రాంతంలో ఉండటంతో అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా మూగజీవాలకు అర్థాకలి తప్పడం లేదు. ఎండుగడ్డి, దాణా కోసం రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నట్లు లెక్కల్లో చూపుతున్నా, లభించేది అరకొరే. దీంతో లేగ దూడలు బక్కచిక్కుతున్నాయి. ఇక్కడి గేదెలు, ఆవుల ద్వారా పాల ఉత్పత్తులను విక్రయిస్తున్నా, రికార్డుల్లో మాత్రం కాకి లెక్కలు చూపుతున్నారు. గోవుల కోసం దాతలు ఉచితంగా ఇచ్చే ఎండు గడ్డిని సైతం కొనుగోలు చేసినట్లు లెక్కలు చూపి నిధులను కాజేస్తున్నారనే విమర్శలూ లేకపోలేదు. వేసవిలో సరిపడా నీరు లేక దాహంతో జీవాలు అల్లాడుతున్నాయి.

పశుగ్రాసానికి కొరత

తాగునీటికీ కటకట

బ్రూసెల్లోస్‌ వ్యాధితో

విలవిల్లాడుతున్న మూగజీవాలు

రూ.లక్షలు వెచ్చిస్తున్నా,

వాటి ఆరోగ్యంపై నిర్లక్ష్యం

ఇదీ చింతలదేవిలోని కేంద్ర దుస్థితి

No comments yet. Be the first to comment!
Add a comment
కామధేనులో మూగరోదన 1
1/1

కామధేనులో మూగరోదన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement