
గిట్టుబాటు ధర కల్పనలో విఫలం
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
నెల్లూరు(బారకాసు): రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. డైకస్‌రోడ్డులోని పార్టీ జిల్లా కార్యాలయంలో వెంకటాచలం మండల పార్టీ నేతలు, కార్యకర్తలతో శనివారం సమావేశమైన ఆయన మాట్లాడారు. ప్రజా ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు గిటుబాటు ధర కల్పించకుండా ప్రకటనలనే పరిమితమవుతున్నారని విమర్శించారు. సోమిరెడ్డి మొక్కుబడిగా జరిపిన గొలగమూడి పర్యటనను చూసి రైతులు ఆవేదనకు గురయ్యారని చెప్పారు. డ్రామాలను ఆపి, రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలని హితవు పలికారు. తమ ప్రభుత్వ హయాంలో గతేడాది పుట్టి ధాన్యం రూ.25 వేలు పలకగా, ప్రస్తుతం రూ.16 వేలకు పతనమైందని తెలిపారు. రైతుల కు కనీస గిట్టుబాటు ధరగా రూ.19720 కల్పించాల్సి ఉండగా, దళారులు రూ.16 వేలకే దోచుకుంటున్నారని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా, అధికారులు, ప్రజాప్రతినిధులు చోద్యం చూస్తున్నారే తప్ప, రైతులను ఆదుకునేందుకు యత్నించడంలేదన్నారు. బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా సమస్యను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లి, మద్దతు ధర కల్పించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. తమ పార్టీ నేతలు, కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న పోలీస్ అధికారులను విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. పోలీసులు అనుచితంగా ప్రవర్తించారనే అంశాన్ని తన దృష్టికి తీసుకొస్తే న్యాయస్థానాలను ఆశ్రయించి ప్రైవేట్ కేసులేస్తామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో అవినీతి విధానాలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు. ప్రజలకు ఏ సమస్యొచ్చినా అండగా నిలిచి పోరాటాలకు సిద్ధంగా ఉంటామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment