28, 29 తేదీల్లో అభ్యర్థులకు పరీక్ష
నెల్లూరు(టౌన్): కస్తూరిదేవి ఎయిడెడ్ బాలికల హైస్కూల్, శ్రీపొట్టి శ్రీరాములు ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలల్లో ఖాళీ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈనెల 28, 29 తేదీల్లో ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించనున్నట్లు డీఈఓ ఆర్.బాలాజీరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నెల్లూరులోని కస్తూరిదేవి బాలికల హైస్కూల్లో ఎస్‌ఏ మ్యాథ్స్ – 2, ఎస్‌ఏ బీఎస్ – 1, ఎస్‌ఏ పీఎస్ – 1, ఎస్జీటీ – 2, ఎస్‌ఏ హిందీ – 1, గూడూరులోని శ్రీపొట్టి శ్రీరాములు ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీ – 1, ఎల్‌పీ హిందీ – 1, ఎల్‌పీ తెలుగు – 1 పోస్టులు ఉన్నాయన్నారు. దరఖాస్తు చేసిన అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను https://cse.ap.gov.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. పాఠశాల యాజమాన్యాలకు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు ఇచ్చిన వారు తమ వద్ద ఉన్న ఆధారాలను సమర్పిస్తే జిల్లా విద్యాశాఖ వారు హాల్‌టికెట్ జారీ చేస్తారన్నారు.
నెల్లూరులో ఆర్పీఎఫ్ ఐజీ
నెల్లూరు(క్రైమ్): వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం ఆర్పీఎఫ్ ఐజీ ఆరోమా సింగ్ నెల్లూరు రైల్వేస్టేషన్‌కు వచ్చారు. స్థానిక ఆర్పీ ఎఫ్ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని ఆమె సిబ్బందికి సూచించారు. నెల్లూరు రైల్వే డీఎస్పీ మురళీధర్ ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
ట్రాక్టర్ ట్రక్కు కింద
సేద తీరుతుండగా..
● ఒక్కసారిగా వాహనం తీసిన డ్రైవర్
● ఓ మహిళ మృతి, మరొకరికి గాయాలు
బుచ్చిరెడ్డిపాళెం: ఆ మహిళలు ట్రాక్టర్ ట్రక్కు కింద సేద తీరుతున్నారు. దీనిని గుర్తించకుండా ఒక్కసారిగా వాహనాన్ని డ్రైవర్ తీశాడు. దీంతో ఒక మహిళ మృతిచెందగా.. మరొకరు గాయపడ్డారు. ఈ ఘటన బుచ్చిరెడ్డిపాళెం మండల పరిధిలోని పంచేడు గ్రామానికి చెందిన పొలాల్లో మంగళవారం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. భాస్కర్ అనే వ్యక్తి తన పొలంలో మెషీన్ ద్వారా వరికోతలు చేయిస్తున్నాడు. ధాన్యాన్ని మెషీన్ వద్ద నుంచి బాటపైకి తీసుకొచ్చేందుకు ఏర్పాటు చేసిన ట్రాక్టర్‌ను కొద్దిసేపు డ్రైవర్ పక్కన నిలిపాడు. గెనాలకు గడ్డి కోసేందుకు నాగూరు ప్రమీలమ్మ (48), మరో మహిళ వచ్చారు. ఎండ అధికంగా ఉండటంతో వీరు సేద తీరేందుకు ట్రాక్టర్ ట్రక్కు కింద కూర్చొన్నారు. ఈ సమయంలో వరికోత మెషీన్ ఆపరేటర్ ట్రాక్టర్ డ్రైవర్‌ను పిలిచి వాహనాన్ని తీసుకురమ్మన్నాడు. డ్రైవర్ ట్రాక్టర్‌ను తిప్పే క్రమంలో మహిళలను గుర్తించకుండా వారిపైకి ఎక్కించి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో ప్రమీలమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. మరో మహిళ గాయపడి పెద్దగా కేకలు వేసింది. చుట్టుపక్కల ఉన్నవారు వచ్చి ఆమెను బుచ్చిరెడ్డిపాళెం వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఉరేసుకుని
వ్యక్తి ఆత్మహత్య
వెంకటాచలం: కుటుంబ కలహాలతో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని అనికేపల్లిలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. అనికేపల్లి గ్రామానికి చెందిన వాసిలి కొండస్వామి (46)కి భార్య వెంకట సురేఖ, ఒక కుమారుడు ఉన్నారు. కొండస్వామి మద్యానికి బానిసయ్యాడు. అతను కుటుంబాన్ని పట్టించుకోలేదు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య విభేదాలు నెలకొన్నాయి. మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కొండస్వామి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
నూతన కార్యవర్గ ఎన్నిక
నెల్లూరు(పొగతోట): పశు సంవర్థక శాఖ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా నూతన కమిటీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. మంగళవారం నెల్లూరులో కమిటీ ఎన్నికలు నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ ఐ.కృష్ణమౌర్య, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ డి.మాధవిలత, ఉపాధ్యక్షులుగా మాలకొండయ్య, శశిధర్, సంయుక్త కార్యదర్శులుగా సుబ్రహ్మణ్యం, చంద్రశేఖర్‌రెడ్డి, కోశాధికారిగా డాక్టర్ జె.చైతన్య కిశోర్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కమిటీ సభ్యులుగా డాక్టర్ బి.మురళీకృష్ణ, డాక్టర్ జె.యశోధ, డాక్టర్ బి.సురేష్, డాక్టర్ కె.సురేష్, డాక్టర్ వైవీ కామేశ్వరరావు, డాక్టర్ సీహెచ్ లక్ష్మీశైలజ వ్యవహరిస్తారు.
28, 29 తేదీల్లో అభ్యర్థులకు పరీక్ష
28, 29 తేదీల్లో అభ్యర్థులకు పరీక్ష
Comments
Please login to add a commentAdd a comment