వక్ఫ్‌ భూములు ఉఫ్‌ | - | Sakshi
Sakshi News home page

వక్ఫ్‌ భూములు ఉఫ్‌

Published Thu, Apr 3 2025 12:23 AM | Last Updated on Thu, Apr 3 2025 12:23 AM

వక్ఫ్

వక్ఫ్‌ భూములు ఉఫ్‌

కబ్జాదారుల

కబంధహస్తాల్లో వేల ఎకరాలు

జిల్లాలోని వక్ఫ్‌బోర్డుకు సంబంధించి వేల ఎకరాలు కబ్జాదారుల కబంధహస్తాల్లో ఉన్నాయి. అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి వక్ఫ్‌బోర్డు ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలి. పూర్వీకులు తమ ఆస్తులను వక్ఫ్‌బోర్డుకు ఇచ్చారు. ఆ భూముల నుంచి వచ్చే ఆదాయంతో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.

– షేక్‌ మొయినుద్దీన్‌, మైనార్టీ నేత

వక్ఫ్‌ బోర్డు ఆస్తులను

పరిరక్షించుకోవాలి

జిల్లాలో వక్ఫ్‌బోర్డు భూములు కబ్జాలకు గురవుతున్నాయి. అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి కబ్జాదారుల నుంచి వక్ఫ్‌ బోర్డు భూములకు విముక్తి కల్పించాలి. వక్ఫ్‌ ఆస్తులన్నీ కొందరు పెద్దల చేతుల్లో ఉన్నాయి. వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత వక్ఫ్‌బోర్డుపై ఉంది.

– మహ్మద్‌ జుబేర్‌, మైనార్టీ నేత

వక్ఫ్‌ భూముల

రక్షణ బాధ్యత అందరిది

వక్ఫ్‌బోర్డు భూములను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కర పై ఉంది. అధికారులు కూడా తూతూ మంత్రంగా కాకుండా క్షేత్ర స్థాయిలో కబ్జాకు గురైన భూములను స్వాధీనం చేసుకుని వక్ఫ్‌బోర్డుకు అప్పగించాలి. వక్ఫ్‌బోర్డు పాలక యంత్రాంగం దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

– అబ్దుల్‌ రజాక్‌, మైనార్టీ నాయకుడు

జిల్లాలో వేలాది ఎకరాల వక్ఫ్‌ బోర్డు భూములు కబ్జాదారుల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి. నెల్లూరు నగరం సహా 31 మండలాల్లో వక్ఫ్‌ బోర్డు భూములు దశాబ్దాలుగా అన్యాక్రాంతంలో ఉన్నాయి. వీటిలో అనేక ప్రాంతాల్లోని భూములు సాగు పేరుతో తీసుకుని రికార్డులు మార్చేసుకుని కొందరు అనుభవిస్తుండగా, మరికొన్ని సేవా కార్యక్రమాలకు కేటాయించిన భూములు కూడా అన్యాక్రాంతం చేశారు. రెవెన్యూ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా పట్టాలు ఇవ్వడం వివాదాస్పదంగా మారాయి. జిల్లాలో ఒకటి రెండు కాదు దాదాపు 4 వేల ఎకరాల భూమి పరాధీనంలో ఉన్నట్లు వక్ఫ్‌ బోర్డు అధికారులు గతంలో లెక్క తేల్చారు. ఈ భూములు ఇప్పటికీ వక్ఫ్‌బోర్డు స్వాధీనం చేసుకోలేకపోయింది. జిల్లాకు చెందిన మైనార్టీ నేత వక్ఫ్‌బోర్డు చైర్మన్‌గా ఉన్నారు. ఆయన ఈ భూముల రక్షణపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలో ఆరు దశాబ్దాలుగా వక్ఫ్‌ భూములు అన్యా క్రాంతానికి గురవుతున్నాయి. నెల్లూరు నగరంలో ఖరీదైన ప్రాంతాలుగా ఉన్న మాగుంట లేఅవుట్‌, పొగతోటలోనూ వక్ఫ్‌బోర్డు భూములు అధికంగా ఉన్నాయి. జిల్లాలోని 31 మండలాల్లో భూములు ఆక్రమణల్లో ఉన్నాయి. వీటిలో నెల్లూరు నగరంలో 49 సర్వే నంబర్లలో 150.60 ఎకరాల భూమి ఉంది. ఉదయగిరి మండలంలో 5 సర్వే నంబర్లలో 340.51 ఎకరాల భూమి ఆక్రమణల్లో ఉంది. చట్ట ప్రకారం వక్ఫ్‌ బోర్డు భూముల్ని ఆక్రమించటం నేరం. అయితే జిల్లాలో వక్ఫ్‌బోర్డు ఏర్పాటు కావడానికి ముందు నుంచే ఇనాం భూములు, సర్వీసు భూములు, ముతవలీలకు కౌలుకు ఇచ్చిన భూములను అప్పటి రెవెన్యూ అధికారులు ఇష్టారాజ్యంగా పట్టాలు జారీ చేశారు. రెవెన్యూ రికార్డుల్లో ఉండే ఆర్‌ఎస్‌ఆర్‌ వివరాలను రెవెన్యూ అధికారులు పరిగణలోకి తీసుకోకుండా భూములకు పట్టాలు ఇవ్వడంతో క్రయవిక్రయ రిజిస్ట్రేషన్లు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. 1954లో కేంద్ర చట్టంను అనుసరించి వక్ఫ్‌ బోర్డు ఏర్పాటు అయింది. ఏపీ వక్ఫ్‌ బోర్డు యాక్ట్‌ 1954 ప్రకారం ధార్మిక కార్యక్రమాలకు, ముతవలీలకు కేటాయించిన సర్వీసు భూములను క్రయ విక్రయాలు చేయడం నేరం అవుతుంది. అయితే చట్టానికి ముందు నుంచే ఆక్రమణ పర్వం కొనసాగుతూనే ఉంది. ఈ విషయాన్ని వక్ఫ్‌బోర్డు అధికారులు అనేక పర్యాయాలు గతంలో టీడీపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా.. పట్టించుకోని పరిస్థితి. ఈ నేపథ్యంలో గత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకునే ప్రయత్నం జరిగింది.

ఎక్కడ.. ఎంతెంత

నెల్లూరు నగరంలోని పొగతోట, మాగుంట లేఅవుట్‌, సరస్వతీనగర్‌, ఫత్తేఖాన్‌పేట, స్వతంత్ర పార్క్‌తోపాటు మరికొన్ని కలిపి 150.60 ఎకరాలు ఉన్నట్లు నిర్ధారించారు. అయితే నగరంలో అన్ని ప్రాంతాల్లో దాదాపు అరవై ఏళ్లకు పైబడి నివాసాలు ఉన్నాయి. నెల్లూరు నగరంలో 49 సర్వే నంబర్లలో 150.60 ఎకరాలు, కోవూరులో 34 సర్వే నంబర్లలో 78.79 ఎకరాలు, రాపూరులో 25 సర్వే నంబర్లలో 58.50 ఎకరాలు, విడవలూరులో 91 సర్వే నంబర్లలో 2.00 ఎకరాలు, కొడవలూరులో 5 సర్వే నంబర్లలో 7.14 ఎకరాలు, పొదలకూరులో 11 సర్వే నంబర్లలో 13.61 ఎకరాలు, టీపీ గూడూరులో 13 సర్వే నంబర్లలో 22.01 ఎకరాలు, వెంకటాచలంలో 4 సర్వే నంబర్లలో 13.70 ఎకరాలు, బుచ్చిరెడ్డిపాళెంలో 11 సర్వే నంబర్లలో 53.04 ఎకరాలు, ఆత్మకూరులో 7 సర్వే నంబర్లలో 45.00 ఎకరాలు, ఏఎస్‌పేటలో 14 సర్వే నంబర్లలో 91.33 ఎకరాలు, చేజర్లలో 4 సర్వే నంబర్లలో 96.97 ఎకరాలు, కలువాయి 2 సర్వే నంబర్లలో 74.51 ఎకరాలు, సంగంలో 4 సర్వే నంబర్లలో 11.59 ఎకరాలు, సీతారామపురంలో 5 సర్వే నంబర్లలో 64.49 ఎకరాలు, మర్రిపాడులో రెండు సర్వే నంబర్లలో 19.49 ఎకరాలు, ఉదయగిరి మండలంలో 5 సర్వే నంబర్లలో 340.91, అనంతసాగరం మండలంలో 13 సర్వే నంబర్లలో 32.46 ఎకరాలు, కావలిలో 3 సర్వే నంబర్లలో 140.59 ఎకరాలు, అల్లూరు మండలంలో 2 సర్వే నంబర్లలో 69.92 ఎకరాలు, దగదర్తి మండలంలో 2 సర్వే నంబర్లలో 9.75 ఎకరాలు, కొండాపురం 1 సర్వే నంబర్‌లో 11.43 ఎకరాలు, జలదంకిలో ఒక సర్వే నంబర్‌లో 92.63 ఎకరాలు, కలిగిరిలో 3 సర్వే నంబర్లలో 24.32 ఎకరాలు, వరికుంటపాడు మండలంలో 1 సర్వే నంబర్లో 96.93 ఎకరాలు, కోట మండంలలో 4 సర్వే నంబర్లలో 18.82 ఎకరాలు, వాకాడులో రెండు సర్వే నంబర్లలో 9.65 ఎకరాల భూమి, చిల్లకూరులో 2 సర్వే నంబర్లలో 27.72 ఎకరాలు, సైదాపురం మండలంలో మూడు సర్వే నంబర్లలో 03.92 ఎకరాలు, సూళ్లూరుపేటలో మూడు సర్వే నంబర్లలో 94.84 ఎకరాలు, వింజమూరులో ఒక సర్వే నంబర్లో 95 ఎకరాలు ఆక్రమణలకు గురయ్యాయి.

వక్ఫ్‌ బిల్లు ఆమోదంతో

ఆస్తుల రక్షణ జరిగేనా?

గతంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వక్ఫ్‌బోర్డులో సంస్కరణలు తెస్తూ తాజాగా కొత్తగా వక్ఫ్‌ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టగా ఆమోదం లభించింది. ఇప్పటి వరకు పూర్తిగా వక్ఫ్‌ బోర్డు పాలకుల పరిధిలో ఉండే ఆస్తుల సంరక్షణ బాధ్యత ఇక ప్రభుత్వ పరిధిలోకి రానుంది. వక్ఫ్‌బోర్డు పరిధిలో ఉండగానే ఈ ఆస్తులన్నీ అన్యాక్రాంతం అయ్యా యి. తాజాగా కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌తో ఈ ఆస్తుల రక్షణ జరిగే అవకాశం ఉంటుందా? లేక పరాధీనం జరిగే పరిస్థితులపై వేచి చూడాల్సిందే.

జిల్లాలో 31 మండలాల్లో 4 వేల ఎకరాల ఆక్రమణలు

దాదాపు 60 ఏళ్ల నుంచి ఇదే పరిస్థితి

నెల్లూరు నగరంలోనే అత్యధికంగా 150.60 ఎకరాల భూమి

ఉదయగిరిలో 340.51

ఎకరాలు అన్యాక్రాంతం

వక్ఫ్‌ భూములు ఉఫ్‌1
1/3

వక్ఫ్‌ భూములు ఉఫ్‌

వక్ఫ్‌ భూములు ఉఫ్‌2
2/3

వక్ఫ్‌ భూములు ఉఫ్‌

వక్ఫ్‌ భూములు ఉఫ్‌3
3/3

వక్ఫ్‌ భూములు ఉఫ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement