
నారా లోకేష్ చేసిన ఆరోపణలు నిరాధారమంటూ ఆధారాలతో వివరిస్తున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి
ధర్మవరం: తప్పుడు ఆరోపణలతో వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేవిధంగా ఆరోపణలు చేసి బురదజల్లాలని చూస్తే సహించేది లేదని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి టీడీపీ నేతలు నారా లోకేష్, పరిటాల శ్రీరామ్‌లను హెచ్చరించారు. గురువారం పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాట్లాడారు. ఇటీవల ధర్మవరం మండలంలో తాను కొనుగోలు చేసిన ఫాంహౌస్‌కు సంబంధించి చెరువు స్థలాన్ని కబ్జా చేశానని, పక్క వారి భూముని కూడా గూగుల్ మ్యాప్‌లో చిత్రీకరించి నారా లోకేష్ చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని పేర్కొన్నారు.
వాస్తవంగా ధర్మవరం పొలంలో సర్వే నంబర్ 904, 905, 908, 909లలో కేవలం 25.38 ఎకరాలను కొనుగోలు చేసి అందులో మాత్రమే ఫాంహౌస్ నిర్మించి వ్యవసాయం చేస్తున్నామన్నారు. ఈ పొలాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసినట్లు తెలిపారు. అయితే నారా లోకేష్ మాత్రం తన ఫాంహౌస్‌కు ఆనుకుని సర్వే నంబర్ 43లో ఉన్న జే. సూర్యనారాయణ అనే రైతుకు చెందిన పొలాన్ని తనదిగా చూపుతూ గూగుల్ మ్యాప్‌లో చిత్రీకరించి 20 ఎకరాలు కబ్జా చేశానని చెప్పడం ఎంత వరకు సమంజసమన్నారు. నారా లోకేష్ ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం వల్ల మరింత విలువలు దిగజారి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంలో ఏ విచారణకై నా తాను సిద్ధమని, ఒకవేళ తాను చెప్పింది నిజమని తేలితే మీరు రాజకీయాల నుంచి తప్పుకుంటారా? అని ప్రశ్నించారు. ఒక వేల అబద్ధమని తేలితే తాను ఎమ్మెల్యే పదవికి తక్షణం రాజీనామా చేస్తానని, సవాల్‌ను స్వీకరించే దమ్ముందా? అని ప్రశ్నించారు.
ఆధారాలతో సహా మీడియాకు...
ధర్మవరం నియోజకవర్గంలోని ముదిగుబ్బ మండలంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి అనుచరులు 20 ఎకరాల భూమిలో ప్లాట్లు వేసి రూ.60 కోట్లు కాజేశారని నారా లోకేష్ తాజాగా ఆరోపించారన్నారు. ఇది కూడా పూర్తిగా అవాస్తవమన్నారు. 2009లో తామే ఈ పొలంలో పేదలకు ఇళ్ల పట్టాలను మంజూరు చేశామని తెలిపారు. ఆ తర్వాత 2014లో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారం టీడీపీ నాయకులు, కార్యకర్తలకు ఆ స్థలంలో పట్టాలను పంపిణీ చేసి ప్లాట్లను కాజేశారన్నారు. ఈ పొలం కూడా కోర్టు పరిధిలో ఉందన్నారు. అలానే దొరిగిల్లు రోడ్డులో సర్వే నంబర్ 1330–1లో గుట్టలు చదును చేసి 17 ఎకరాలను ఆక్రమించారని ఆరోపించారన్నారు.
వాస్తవంగా అయితే తామే ఈ పొలం అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వ భూమి అని తెలియజేసే బోర్డును ఏర్పాటు చేయించినట్లు వివరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోను మీడియాకు ఎమ్మెల్యే చూపించారు. అంతేకాక సదరు స్థలంలో కొంత భాగంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలానే దొరిగిల్లు రోడ్డులో సర్వే నంబర్ 2060–4 మూడెకరాల స్థలాన్ని గత టీడీపీ ప్రభుత్వం ఖబరస్థాన్‌ను ఏర్పాటు చేస్తే దాని ఆక్రమించారని చెప్పారని ఇది పూర్తిగా అవాస్తవమన్నారు. వాస్తవంగా అయితే 2022లో 2–90 ఎకరాల స్థలాన్ని ఖబరస్తాన్‌కు స్థలాన్ని కేటాయించింది తామేనన్నారు. ఇందుకు సంబంధించి ఈ స్థలం పూర్తి రక్షణలో ఉందన్నారు. దీనికి సంబంధించి ఆర్డీఓ ఇచ్చిన ఆర్డర్ కాపీని ఎమ్మెల్యే మీడియాకు చూపించారు.
పరువు నష్టం దావా వేస్తా
ప్రతి ఒక్క ఆరోపణకు తాను ఆధారాలతో సహా వివరణ ఇస్తున్నానని, తాను ఒక్కటే చెబుతున్నానని తన అనుచరులు ఎవరైనా సరే చిన్నపాటి తప్పు చేసిన ఉపేక్షించేది లేదన్నారు. అయితే ఏ ఆధారం లేకుండా తప్పుడు ఆరోపణలు చేసే మీలాంటి వారిని ప్రజలు క్షమించరన్నారు. పాదయాత్రలో ప్రజలకు మీరు ఏం మంచి చేస్తారో చెప్పాల్సింది పోయి ఇలా బురదజల్లుడు రాజకీయాలు చేస్తూ పోతే మనుగడ ఉండదని హెచ్చరించారు. నిరాధార ఆరోపణలు చేసిన నారా లోకేష్, పరిటాల శ్రీరామ్‌లతో సహా యల్లో మీడియాపై పరువు నష్టం దావా వేస్తానని ఎమ్మెల్యే కేతిరెడ్డి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment