పెనుకొండ: స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో నల్లనాగు కలకలం సృష్టించింది. బుధవారం 9 గంటలకు ట్రామా కేర్ సెంటర్‌లో విధులకు హాజరైన సూపర్‌వైజర్ శ్రీనివాసులు.. అక్కడి డిప్యూటీ డీఎంహెచ్‌ఓ చాంబర్‌లో శబ్దం రావడంతో అటుగా వెళ్లి చూశారు. లోపల పడగ విప్పిన నల్లనాగు కనిపించడంతో భయంతో ఎటూ కదల్లేకుండా ఉండిపోయాడు. కాసేపటి తర్వాత తేరుకుని తోటి ఉద్యోగులకు ఫోన్ ద్వారా సమాచారం చేరవేయడంతో సిబ్బంది, ప్రజలు ట్రామాకేర్ సెంటర్‌కు వద్దకు భారీగా చేరుకున్నారు. కొందరు పాలు తీసుకువచ్చి పాము సమీపంలో ఉంచారు.
మరికొందరు పాముకు దండాలు పెట్టారు. దీంతో పాము ఎటూ వెళ్లలేక అక్కడే పడగ విప్పి నిలబడిపోయింది. విషయం తెలుసుకున్న స్థానిక రామమందిరం ప్రాంతానికి చెందిన యువకుడు రాజు అక్కడకు చేరుకుని పామును పట్టుకునే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో పాము కాటు వేసింది. అయినా ఆ యువకుడు పామును పట్టుకుని ఆస్పత్రి వెనుక పొదల్లోకి వదిలాడు. అనంతరం రాజుకు అక్కడే ఉన్న వైద్యులు ప్రాథమిక చికిత్స చేసి, మెరుగైన వైద్యం కోసం పుట్టపర్తికి తరలించారు. విష ప్రభావం ఎక్కువగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు అనంతపురంలోని సర్వజనాస్పత్రికి కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై రాజుకు అనంతపురం వైద్యులు చికిత్స చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment