‘సాఫ్ట్‌’గా ప్రవేశించి.. రికార్డులు లిఖించి | - | Sakshi
Sakshi News home page

‘సాఫ్ట్‌’గా ప్రవేశించి.. రికార్డులు లిఖించి

Published Mon, Sep 11 2023 1:02 AM | Last Updated on Mon, Sep 11 2023 8:15 AM

- - Sakshi

సాఫ్ట్‌బాల్‌ క్రీడల్లో నాలుగుసార్లు ఆమె అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటింది. సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జన్మించినా.. ఆటపై మక్కువ పెంచుకుని మెరికలా మారి నాలుగు సార్లు పతకాలు సాధించింది. వివాహమైనా క్రీడలకు దూరం కాక ఆత్మవిశ్వాసంతో దూసుకెళ్లింది. ఆ క్రమంలోనే ‘లాక్రోస్‌’ ఆట వైపు దృష్టి సారించింది. అక్కడా సత్తా చాటి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొననున్న జట్టుకు ఎంపికై ంది.

అనంతపురం: సాఫ్ట్‌బాల్‌ క్రీడలో నాలుగుసార్లు ఆమె అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటింది. సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జన్మించినా.. ఆటపై మక్కువ పెంచుకుని మెరికలా మారి నాలుగు సార్లు పతకాలు సాధించింది. వివాహమైనా క్రీడలకు దూరం కాక అచంచెల ఆత్మవిశ్వాసంతో దూసుకెళ్లింది. ఆ క్రమంలోనే ‘లాక్రోస్‌’ ఆట వైపు దృష్టి సారించింది. అక్కడా సత్తా చాటి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొననున్న జట్టుకు ఎంపికై ంది. పెద్దపప్పూరు మండలం సోమనపల్లి గ్రామానికి చెందిన జే. రాధిక ఎస్కేయూ పరిధిలో డిగ్రీ పూర్తి చేసింది.

సాఫ్ట్‌బాల్‌ క్రీడలో రాణిస్తూ.. అంచెలంచెలుగా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి జట్లకూ ఎంపికై ంది. చైనా, అమెరికా దేశాల్లో దేశం తరఫున పాల్గొని రాణించింది. గ్రామీణ ప్రాంతంలోని ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టినా.. మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ఒక్కో మెట్టు ఎక్కింది. ఈ క్రమంలోనే లాక్రోస్‌ పోటీలపై మక్కువ పెంచుకున్న ఆమె.. ఆ ఆటలోనూ రాణిస్తూ.. అంతర్జాతీయ పోటీల్లో ప్రాతినిధ్యం వహించే స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం దిల్లీలో శిక్షణ తీసుకుంటోంది. కెనడాలో జరగనున్న పోటీలకు బయలుదేరనుంది.

చిన్న పాప ఉన్నా..
పాఠశాల స్థాయిలో కబడ్డీ, ఖోఖో ఆడుతున్న రాధిక.. పీఈటీల ప్రేరణతో పదేళ్ల క్రితం సాఫ్ట్‌బాల్‌ పోటీల్లో ఎంట్రీ ఇచ్చింది. ఆర్డీటీ ప్రోత్సాహంతో సబ్‌ జూనియర్‌, జూనియర్‌, సీనియర్‌ విభాగాల్లో జాతీయ స్థాయి జట్లలో ప్రాతినిథ్యం వహించింది. ఆమె ప్రతిభను మెచ్చిన సెలెక్టర్లు అంతర్జాతీయ పోటీలకు ఎంపిక చేశారు. చైనాలో రెండు పర్యాయాలు, సింగపూర్‌, అమెరికాలో ఒక్కసారి చొప్పున అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంది. డిగ్రీ పూర్తికాగానే తల్లిదండ్రులు పెళ్లి చేశారు. ఆమె ఓ పాపకు జన్మనిచ్చింది. వివాహం తర్వాత సాధారణంగా మహిళలు క్రీడలకు స్వస్తి పలుకుతారు. అయితే, రాధిక మాత్రం ఇందుకు భిన్నంగా కుస్తీ పోటీల్లో ప్రవేశించింది.

రాధిక సాధించిన విజయాలు..
సింగపూర్‌లో జరిగిన అంతర్జాతీయ సాఫ్ట్‌బాల్‌ పోటీల్లో దేశం తరఫున ప్రాతినిధ్యం వహించి రజత పతకం కైవసం చేసుకుంది.

► చైనాలో 2016,2018లో జరిగిన ఆసియా జూనియర్‌ బాలికల సాఫ్ట్‌బాల్‌ ఛాంపియన్‌ షిప్‌, ఆసియా విశ్వవిద్యాలయాల సీనియర్‌ సాఫ్ట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ పోటీలో పాల్గొని ఐదో ర్యాంకు పొందింది.

► 2017లో అమెరికాలో జరిగిన జూనియర్‌ ప్రపంచ సాఫ్ట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో రాధిక పాల్గొంది.

► 2013 నుంచి 2019 నుంచి వరుసగా 14 సార్లు జూనియర్‌, సీనియర్‌ విభాగాల్లో జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీల్లో సత్తా చాటింది.

సత్తా చాటుతా..
అక్టోబర్‌ 6,7,8 తేదీల్లో లాక్రోస్‌ టోర్నమెంట్‌ కెనడాలోని ఓషావాలో ఉంటుంది. గ్రామీణ ప్రాంతంలో ఓ సాధారణ కుటుంబం నేపథ్యం నాది. పోటీల్లో పాల్గొనాలంటే రూ.3 లక్షల వరకూ ఖర్చు అవుతుంది. స్పాన్సర్లు ఆదుకుంటే కెనడా వెళ్లి దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తా. నాకు అవకాశం కల్పించిన రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు. అంతర్జాతీయ పోటీల్లోనూ సత్తా చాటుతాననే నమ్మకం ఉంది.

–జే. రాధిక, క్రీడాకారిణి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement