సాక్షి, పుట్టపర్తి: టీడీపీ, జనసేన ‘పొత్తు’పొడుపు స్థానిక నేతలకు పెద్ద చిక్కుతెచ్చి పెట్టింది. స్కిల్ స్కాం కుంభకోణంలో అరెస్టయిన చంద్రబాబు రాజమండ్రి జైలులో ఉండగా.. పవన్ పొత్తులపై ప్రకటన చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. టీడీపీ పెద్దలు పొత్తు ప్రకటన చేస్తే బాగుంటుంది గానీ, ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా లేని పవన్ ప్రకటించడం ఏమిటో అర్థం కావడం లేదంటూ తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా జనసేన అధినేత కోసం నారా లోకేశ్, నందమూరి బాలకృష్ణ జైలు వద్ద ఎదురు చూడటం వారిని మరింత కుంగ తీసింది.
పైగా టీడీపీ పొత్తుతో జనసేన ఎన్నికల్లో పోటీ చేస్తుందని పవన్ కల్యాణ్ ప్రకటించడం చూసి తమ భవిష్యత్ ఏమిటో అర్థం కాక అయోమయంలో పడిపోయారు. ఏళ్లుగా టీడీపీని నమ్ముకుని ఉన్నామని.. అయితే ఉన్నఫలంగా అధినేత జైలు పాలు కావడంతో నిన్న కాక మొన్న వచ్చిన పార్టీ నేతలే పొత్తులపై నిర్ణయాలు బహిర్గతం చేయడాన్ని తప్పు పడుతున్నారు. ఎవరితో ఎవరు కలవాలనే దానిపై ఇరు పార్టీల పెద్దలు కూర్చుని మాట్లాడి.. వెల్లడించి ఉంటే బాగుండేదని ‘తమ్ముళ్లు’అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
చంద్రబాబును పక్కకు నెట్టేసి..
తమ పార్టీ అధినేత జైలులో ఉంటే.. జనసేనాని టీడీపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తామని ప్రకటించడంపై టీడీపీ నేతల్లో మరో సందేహం కూడా మొదలైంది. చంద్రబాబును బయటికి తెద్దామనే ఆలోచన లేకుండా.. ఎన్నికలు, పోటీలు, పొత్తుల గురించి పవన్ మాట్లాడటం సరికాదని టీడీపీ సీనియర్ నేతలు తప్పుపట్టారు. అంతేకాకుండా అరెస్టయిన చంద్రబాబును బయటికి తేవాలనే ఆలోచన పవన్‌కు లేదా అని మరికొందరు ప్రశ్నించారు. టీడీపీకి అండగా ఉంటామని పవన్ ప్రకటించడం ఏమిటి? పవన్ అండదండలు ఎవరికి కావాలి? పార్టీ గుర్తు కూడా లేని పవన్ టీడీపీకి అండగా నిలవడం ఏందని తీసిపారేస్తున్నారు.
ముదిరిన విభేదాలు..
టీడీపీ – జనసేన పొత్తు ప్రకటన తర్వాత నియోజకవర్గాల్లో ఇరు పార్టీల నాయకుల మధ్య విభేదాలు ముదిరాయి. ఎవరు పోటీ చేస్తారనే దానిపై ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్నారు. దీనికి తోడు ఎలా గెలుస్తారో చూద్దామంటూ ఒకరిపై మరొకరు విమర్శలకూ దిగుతున్నారు. కొన్ని చోట్ల టీడీపీ తరఫున పోటీ చేసేందుకు ముఖ్య నేతలు ముందుకు రావడం లేదు. జనసేనను నమ్ముకుని బరిలో దిగడం ఏమిటనే ప్రశ్నలు నేతల్లో మొదలయ్యాయి. జనసేన నేతలు కూడా టీడీపీని నమ్ముకుని బరిలో దిగితే పరిస్థితి ఏమిటన్నదానిపై లెక్కలు వేసుకుంటున్నారు.
ఎన్నికల ప్రణాళికలో జనసైనికులు..
పవన్ కల్యాణ్ ప్రకటన తర్వాత జనసైనికులు ఎన్నికల ప్రణాళికల్లో మునిగిపోయారు. ఈసారి ధర్మవరం, పుట్టపర్తి, కదిరి స్థానాలను జనసేనకే కేటాయిస్తారన్న సమాచారం ఉందని చెబుతున్నారు. కొందరు జనసేన నాయకులైతే ఏకంగా ఏ నియోజకవర్గంలో నిల్చుంటే బాగుంటుందో లెక్కలు వేసుకుంటున్నారు. అయితే ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ రాలేదు. ఏ స్థానంలో ఎవరు పోటీ చేస్తారో తెలియదు... కానీ అప్పుడే జనసేన నేతలు ఏకంగా పోటీ చేస్తున్నట్లు ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ నేతలు అంటున్నారు.
ఒక్క సీటూ గెలవలేరు
టీడీపీ ఏ పార్టీతో జత కట్టినా వైఎస్సార్ సీపీకి ఎలాంటి నష్టమూ లేదు. రానున్న ఎన్నికల్లో జిల్లాలోని అన్ని స్థానాల్లో వైఎస్సార్‌సీపీ జెండా ఎగరడం ఖాయం. ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడంతో పాటు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్ ముందుకు వెళ్తున్నారు. అందుకే జనమంతా మావైపే నిలిచారు. మా పొత్తు ప్రజలతోనే ఉంటుంది. ప్రజల అండదండలతోనే మరోసారి విజయదుందుభి మోగించడం ఖాయం. ఎన్ని పార్టీలు కలిసి పోటీ చేసినా ‘సింహం సింగిల్ గానే వస్తుంది’.
– మాలగుండ్ల శంకరనారాయణ,వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment