సార్వత్రిక ఎన్నికల వేళ అన్ని రాజకీయ పార్టీలు అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. నాయకులు, కార్యకర్తలు ఊరూవాడా తిరుగుతూ జనంతో మమేకం అవుతుండగా..ఒక్క పార్టీ మాత్రం ఉలుకూ పలుకూ లేకుండా ఉంది. ప్రశ్నిస్తామంటూ పుట్టుకొచ్చిన ఆ పార్టీ... ఎన్నికల్లో పోటీ చేస్తారా...? అంటే సమాధానం చెప్పలేక సతమతమవుతోంది.
సాక్షి, పుట్టపర్తి: జిల్లాలో గ్లాసు గుర్తు పార్టీ జనసేన ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఆ పార్టీ నాయకులు సామాజిక మాధ్యమాల్లో హడావుడి చేస్తున్నా...క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. జిల్లాలో రెండు స్థానాలు తమకు ఇవ్వాలని జనసేన కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. అయితే అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయాలతో ఆ పార్టీ హిందూపురం పార్లమెంటు పరిధిలో ఒక్క చోటైనా పోటీ చేస్తుందా.. అన్నది సందేహంగా మారింది. మరోవైపు జిల్లాలో జనసేనకు ఒక్క సీటు కూడా ఉండదని టీడీపీ కార్యకర్తలు బహిరంగ ప్రచారం చేస్తున్నారు. పైగా చంద్రబాబుతో పవన్‌కల్యాణ్ కూడా డీల్ కుదుర్చుకున్నారని చెబుతున్నారు. దీంతో అధిష్టానం నుంచి ఎలాంటి సానుకూల స్పందన లేకపోవడంతో జనసేన కార్యకర్తలు నైరాశ్యంలో పడ్డారు. గతంలో మాదిరిగా మళ్లీ టీడీపీ జెండా మోయాల్సిందేనా అని మదనపడుతున్నారు. జనసేన అధినేతకు చెప్పలేక.. టీడీపీ వెంట నడవలేక.. కొందరు పార్టీ వీడే యోచనలో ఉన్నట్లు తెలిసింది.
జనసేనకు ‘సున్న’మే..
ఈ ఎన్నికల్లో జిల్లాలో కనీసం రెండు సీట్లు డిమాండ్ చేయాలని జనసేన నాయకులు అనుకున్నారు. ధర్మవరం, పుట్టపర్తి లేదా కదిరి సీటు జనసేనకు కేటాయించాలని డిమాండ్ చేశారు. అయితే ఆయా నియోజకవర్గాల్లో జనసేనకు టికెట్ ఇచ్చేందుకు టీడీపీ అధిష్టానం మొగ్గు చూపడం లేదని తెలుస్తోంది. దీంతో జిల్లాలో జనసేన పోటీ ఉండదని తేలిపోయింది. అక్కడక్కడా జనసేన పేరుతో తిరిగే కార్యకర్తలు.. టీడీపీ జెండా మోయాల్సిన పరిస్థితి నెలకొంది.
అధినేతపై మండిపాటు..
టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పినట్లు పవన్ కళ్యాణ్ ఆడుతున్నారు. కనీసం కార్యకర్తల బాధలను పట్టించుకోకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పుట్టపర్తిలోని ఓ జనసేన కార్యకర్తతో మాట్లాడగా.. ‘గట్టిగా ప్రయత్నిస్తే 65 సీట్లలో పోటీ చేసే వాళ్లం. కానీ మా పవనన్న పట్టించుకోకపోవడంతో ఆ సంఖ్య 20 లోపే ఉంటుందేమో. ఏమీ చేయలేం’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘పవన్ కల్యాణ్ సైకిల్ దిగితేనే మేం పోటీలో ఉండేది’ అని మరో కార్యకర్త తన మనసులో మాట తెలియజేశారు.
ఎన్నాళ్లిలా? ..
ప్రతి ఎన్నికల వేళ జనసేన నేతలు ఏదో ఒక పార్టీ జెండా మోయకతప్పని పరిస్థితి. 2014లో పోటీ చేయకుండా.. టీడీపీకి మద్దతు తెలిపిన జనసేన... 2019 ఎన్నికల్లో హడావుడి చేసింది. అయితే జిల్లాలో ఒక్క చోట కూడా డిపాజిట్ రాలేదు. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ జనసేన పోటీ చేసిందో? లేదో? కూడా ఆ పార్టీ వాళ్లకే తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈసారి జనసేనకు సీట్లు ఇచ్చేందుకు టీడీపీ అధిష్టానం వెనుకడుగు వేస్తున్నట్లు తెలిసింది. దీంతో ఈ సారి కూడా టీడీపీ జెండా మోయాల్సిందేనా అని కార్యకర్తలు బాధపడుతున్నారు.
నాయకుల పేర్లు కూడా తెలియదే!
జిల్లాలో జనసేన నాయకులు ఎవరని సామాన్యులను ప్రశ్నిస్తే... కనీసం రెండు పేర్లు కూడా చెప్పలేని పరిస్థితి. కార్యకర్తలే లేకపోవడంతో గ్రామ స్థాయి నాయకులే నియోజకవర్గ నాయకులుగా చలామణి అవుతున్నారు. ఉన్న ఒకరిద్దరు కూడా పబ్లిసిటీ పిచ్చితో జనసేనలో తిరుగుతున్నట్లు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment