మామిడితోటలో వ్యక్తి దారుణ హత్య
పుట్టపర్తి అర్బన్: మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తిని గొంతు కోసి హతమార్చిన ఘటన వెంగళమ్మచెరువు సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు అందించిన వివరాలు.. బుక్కపట్నం మండలం కొత్తకోటకు చెందిన చియ్యేడు గంగన్న కుటుంబం సుమారు 15 ఏళ్ల క్రితం వెంగళమ్మచెరువులో స్థిరపడింది. గంగన్న కుమారుడు చియ్యేడు నగేష్(35) సొంతంగా ట్రాక్టర్ పెట్టుకొని బాడుగలకు తిప్పడంతోపాటు బేల్దారి పనులకు వెళ్లేవాడు. శుక్రవారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన అతడు తిరిగిరాలేదు. స్థానిక షిర్డీసాయి బాబా ఆలయం సమీపంలోని వెంకటేషు మామిడితోటలో శనివారం సాయంత్రం నగేష్ మృతదేహాన్ని గుర్తించిన గ్రామానికి చెందిన పశువుల కాపరులు మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. దీంతో వారు అక్కడికి చేరుకుని బోరునవిలపించారు. విషయం తెలుసుకున్న పుట్టపర్తి రూరల్ ఎస్‌ఐ లింగన్న సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ రప్పించి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా గ్రామంలోని సీసీటీవీ ఫుటేజీల్లో అదే గ్రామానికి చెందిన దివాకర్ అనే వ్యక్తి నగేష్‌ను బైకుపై ఎక్కించుకెళ్లినట్లు నమోదవడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మృతదేహం పక్కన మద్యం బాటిళ్లు పడి ఉండటంతో మద్యం మత్తులో గొడవ జరిగి హత్యకు గురయ్యాడా లేదా అక్రమ సంబంధం నేపథ్యంలో ఘటన జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. మృతుడి భార్య సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment