ప్రజాసేవే పరమావధిగా పనిచేయాలి
అనంతపురం: పోలీసులు ప్రజా సేవే పరమావధిగా పనిచేయాలని, పోలీసు స్టేషన్ గడప తొక్కే బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత సూచించారు. అనంతపురంలోని పోలీసు శిక్షణ కళాశాల(పీటీసీ)లో స్టైఫండరీ కేడెట్ ట్రైనీ (ఎస్‌సీటీ)–2024 ఎస్‌ఐల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారు మొత్తం 394 మంది ఎస్‌ఐలు కాగా... ఇందులో 300 మంది సివిల్ ఎస్‌ఐలు, 94 మంది ఏపీఎస్‌పీ ఎస్‌ఐలు ఉన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన హోం మంత్రి మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణతో అనేక కఠిన సవాళ్లను ఎదుర్కొని ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో పోలీస్ శాఖ కృషి మరువలేనిదన్నారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లో చేరబోతున్న నూతన ఎస్‌ఐలందరికీ అభినందనలు తెలిపారు. 394 మంది ఎస్‌ఐలలో 97 మంది మహిళా ఎస్‌ఐలు ఉండడం సంతోషంగా ఉందన్నారు. ఇటీవల కాలంలో మహిళలపై దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలు, చిన్నారులపై ఏ చిన్న నేరమూ జరగకుండా వారిని కాపాడే బాధ్యత మనందరిపైనా ఉందన్నారు.
జవాబుదారీతనంతో విధులు
శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్‌ఐలు జవాబుదారీతనంతో విధులు నిర్వర్తించి మంచి పేరు తెచ్చుకోవాలని రాష్ట్ర డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా సూచించారు. అనంతరం శిక్షణ సమయంలో ఫైరింగ్, ఇండోర్, అవుట్‌డోర్ విభాగాల్లో రాణించిన, ప్రతిభ కనబరిచిన వారికి హోం మంత్రి చేతుల మీదుగా పతకాలు, ట్రోఫీలు అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ట్రైనింగ్స్ విభాగం ఐజీపీ కేవీ మోహన్‌రావు, ఏపీఎస్పీ బెటాలియాన్స్ విభాగం ఐజీ రాజకుమారి, కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, అనంతపురం ఎస్పీ పి.జగదీష్, శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ వి.రత్న, జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, ఎమ్మెల్యేలు దగ్గుపాటి ప్రసాద్, ఎమ్మెస్ రాజు, పల్లె సింధూరరెడ్డి, పీటీసీ కోర్సు డైరెక్టర్ మల్లికార్జున వర్మ, తదితరులు పాల్గొన్నారు.
శిక్షణలో రైతుబిడ్డ టాపర్
బెళుగుప్ప మండలం రమనేపల్లికి చెందిన రైతు దంపతులు ఆంజనేయులు, సాలమ్మల కుమారుడైన మంజునాథ్ ఎస్‌ఐ పరీక్ష ఫలితాల్లో అర్హత సాధించి అనంతపురం పోలీసు శిక్షణ కళాశాల(పీటీసీ)లో శిక్షణ పొందాడు. శిక్షణలో అవుట్‌డోర్ టాపర్‌గాను, ఓవరాల్ టాపర్‌గాను, గోల్డ్ మెడల్‌తో పాటు సీఎం పిస్టల్ విజేతగా నిలిచారు. హోంమంత్రి అనిత చేతుల మీదుగా పిస్టల్ అందుకున్నారు. రైతు బిడ్డ ఎస్‌ఐ శిక్షణలో టాపర్‌గా నిలిచి బెళుగుప్ప మండలానికే పేరుతెచ్చారని సర్పంచ్ రమేష్ తదితరులు అభినందనలు తెలిపారు.
ఎస్‌ఐల పాసింగ్ అవుట్‌పరేడ్‌లో హోం మంత్రి అనిత
ప్రజాసేవే పరమావధిగా పనిచేయాలి
Comments
Please login to add a commentAdd a comment