
ఇది పూర్తిగా వంక ప్రాంతం
రాప్తాడు రూరల్: అనంతపురం నగరం చుట్టూ భూములకు విపరీతమైన ధరలు రావడంతో తెలుగుదేశం పార్టీ చోటా నాయకులుగా చెలామణి అవుతున్న కొందరు ప్రభుత్వ భూములపై కన్నేశారు. అధికారం ఉందనే ఽధైర్యంతో రెచ్చిపోతున్నారు. పైసా పెట్టుబడి లేకుండా అప్పనంగా రూ. లక్షలు సంపాదించాలంటే ప్రభుత్వ భూములు కబ్జా చేయడమే మార్గంగా ఎంచుకున్నారు. ఇందులో భాగంగానే 20 ఏళ్ల కిందట ఓపెన్ స్థలాలుగా వదిలిన వాటిని దర్జాగా ఆక్రమించేస్తున్నారు. అనంతపురం రూరల్ మండలం కురుగుంట సమీపంలోని మటన్ మార్కెట్ కాలనీ (ఇందిరమ్మకాలనీ)లో ఆక్రమణే ఇందుకు ఉదాహరణ.
నాలుగు రోజుల క్రితం రంగంలోకి తమ్ముళ్లు
కురుగుంట పొలం సర్వే నంబర్ 83–11, 12లో దాదాపు 20 ఏళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ అర్బన్ హౌసింగ్ స్కీమ్ కింద 178 పాట్లు మంజూరు చేసింది. ఇందులో గుడి, పార్క్ కోసం వేర్వేరు ప్రాంతాల్లో స్థలాలను వదిలి పెట్టారు. అప్పటి నుంచి ఈ స్థలాలు ఖాళీగానే ఉన్నాయి. ఇక్కడ సెంటు ధర రూ.3 లక్షలకు పైగా పలుకుతోంది. గుడి కోసం వదిలిన దాదాపు 22 సెంట్ల స్థలంపై కన్నేసిన టీడీపీ చోటా నాయకులు వెంటనే రంగంలోకి దిగి బండలు నాటించేస్తున్నారు. సెంటున్నర ప్రకారం 15 ఇళ్ల నిర్మాణాలకు స్కెచ్ వేశారు. బరితెగించి కబ్జా చేస్తుండడం వెనుక కనగానపల్లి మండలానికి చెందిన ఓ టీడీపీ నాయకుడి హస్తమున్నట్లు విశ్వసనీయ సమాచారం. తన వాటాగా లక్షలాది రూపాయలను ఆయన ముందుగానే తీసుకుని అభయం ఇవ్వడంతో చోటా నాయకులు మరింత రెచ్చిపోయారు.
వంకను కుదించి.. చదును చేసి..
కురుగుంట పొలం సర్వే నంబర్ 83–11, 12కు సమీపంలోనే సర్వే నంబరు 89లో రెవెన్యూ రికార్డులలోని డైక్లాట్ ప్రకారం తడకలేరు వంక స్థలంగా గుర్తింపు ఉంది. ప్రస్తుతం ఈ వంక స్థలాన్ని సైతం కబ్జా చేసి పేదలకు అమ్మకానికి పెట్టారు. వర్షాకాలం వస్తే ఈ వంక ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఉపరితల ప్రాంతాల నుంచి వచ్చే వరద ప్రవాహాన్ని తట్టుకోలేక సమీప కాలనీలన్నీ మునిగిపోయిన సందర్భాలూ చాలా ఉన్నాయి. ఇలాంటి వంకను సైతం ఆక్రమించి ఆనకట్టలా మట్టితో నిర్మించి దాని పక్కనే ఇళ్ల స్థలాల కోసం బండలు నాటుతున్నారు. ‘డబ్బు కొట్టు–స్థలం పట్టు’ అన్న చందంగా పేదల నుంచి డబ్బు వసూళ్లు చేస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించకపోతే భవిష్యత్తులో పండమేరు వాగులో కాలనీలకు కాలనీలు మునిగిపోయిన ఘటన ఇక్కడ కూడా పునరావృతం అయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అది ప్రజాప్రయోజనాల స్థలం
ఇందిరమ్మ అర్బన్ హౌసింగ్ స్కీమ్ కింద ఏర్పాటైన కాలనీలో ప్రజాప్రయోజనాల కోసం కొంత స్థలాన్ని వదిలారు. గుడి కోసం వదిలిన స్థలంలో కొందరు బండలు నాటుతున్న విషయం తెలుసుకుని పనులు నిలబెట్టాలని చెప్పాం. తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లి సర్వే చేయించి ప్రభుత్వ స్థలమంతా హద్దులు నాటి బోర్డులు ఏర్పాటు చేస్తాం.
– చరణ్, పంచాయతీ కార్యదర్శి, కురుగుంట
సర్వే నంబరు 89 అనేది పూర్తి వంక ప్రాంతం. ఈ ప్రాంతాన్ని చదును చేసి బండలు నాటుతున్నట్లుగా తెలియడంతో అక్కడికెళ్లి పనులు అడ్డుకున్నాం. ఎవరైనా మొండిగా బండలు నాటించాలని చూస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తాం. ఈ విషయాన్ని తహసీల్దార్ దృష్టికీ తీసుకెళ్లాను.
– రామకృష్ణ, వీఆర్వో

ఇది పూర్తిగా వంక ప్రాంతం
Comments
Please login to add a commentAdd a comment