
‘పోలీసు స్పందన’కు 44 వినతులు
పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 44 వినతులు అందాయి. ఎస్పీ రత్న స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని వాటి పరిష్కారానికి చట్టపరిధిలో చొరవ తీసుకోవాలని సంబంధిత ఎస్‌హెచ్‌ఓలను ఆదేశించారు. కార్యక్రమంలో మహిళా పీఎస్ డీఎస్పీ ఆదినారాయణ, లీగల్ అడ్వైజర్ సాయినాథ్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
దళిత, గిరిజన ఉద్యోగులపై కక్ష సాధింపులు మానాలి
● ఏపీ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘం
అధ్యక్షుడు జయరామ్
పుట్టపర్తి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దళిత, గిరిజన ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్‌కుమార్ సస్పెన్షనే ఇందుకు నిదర్శమని ఏపీ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కటిక జయరామ్ మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సహజ న్యాయ సూత్రాలను కూటమి సర్కార్ తుంగలో తొక్కుతోందని విమర్శించారు.అనుమతి లేకుండా విదేశీ పర్యటన చేసినందుకు సునీల్‌కుమార్‌ను సస్పెండ్ చేసినట్లు ప్రభుత్వం చెప్పుకోవడం సబబు కాదన్నారు. సునీల్‌కుమార్ తన సొంత ఖర్చులతోనే అమెరికా పర్యటనకు వెళ్లారని, ఇందులో తప్పేముందని ప్రశ్నించారు. దీనిపై కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఆయనపై చర్యలు తీసుకోవడం కుట్రలో భాగంగానే అర్థమవుతోందన్నారు. వెనుకబడిన కులాలకు చెందిన పలువురు ఐఏఎస్, ఐపీఎస్ ఉద్యోగులకు పోస్టింగ్‌లు కల్పించక పోవడం కూటమి ప్రభుత్వ కక్ష సాధింపులకు పరాకాష్టగా పేర్కొన్నారు. ఇప్పటికై నా దళిత, గిరిజన ఉద్యోగులపై కక్ష సాధింపులు మానకపోతే కూటమి ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment