
అప్పుల బాధతో యువరైతు ఆత్మహత్య
రొద్దం: అప్పులు తీర్చకపోతే గ్రామంలో పరువు పోతుందని భావించిన ఓ యువరైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాలు... రొద్దం మండలం పెద్దకోడిపల్లి గ్రామానికి చెందిన బోయ వంశీ (28)కు భార్య కుమారి, ఇద్దరు కుమారులు ఉన్నారు. తన తండ్రి పేరుతో ఉన్న 6 ఎకరాల పొలాన్ని సాగు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో పంటల సాగు, ఇతర అవసరాల కోసం ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద రూ 5 లక్షల అప్పుతో పాటు, తన భార్య బంగారు నగలు బ్యాంక్‌లో తాకట్టు పెట్టి మరో రూ 2 లక్షల రుణం తీసుకున్నాడు. అయితే పంటలు సక్రమంగా పండక పోవడంతో అప్పులు తీర్చలేక పోయాడు. దీంతో వడ్డీల భారం పెరిగి అప్పులు రూ.10 లక్షలకు చేరుకున్నాయి. ఈ క్రమంలో అప్పులు తీర్చలేకపోతే గ్రామంలో తలెత్తుకుని తిరగలేమన్న మనోవేదనకు లోనైన వంశీ... సోమవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పైకప్పునకు తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కూలి పనులకు వెళ్లిన భార్య మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇంటికి చేరుకుని తలుపు తట్టినా లోపల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చి కిటికిలో నుంచి చూసింది. విగతజీవిగా ఉరికి వేలాడుతున్న భర్తను చూసి గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకుని తలుపులు బద్ధలుగొట్టి లోపలకు ప్రవేశించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడు తండ్రి నరసింహప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
వివాహిత ఆత్మహత్య
తనకల్లు: మండలంలోని పెద్దపల్లికి చెందిన శాంతమ్మ (30) ఆత్మహత్య చేసుకుంది. చింతామణి తాలూకా రామాపురం గ్రామానికి చెందిన శాంతమ్మకు 15 సంవత్సరాల క్రితం పెద్దపల్లికి చెందిన వెంకటేష్‌తో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. సోమవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాగా, ఆమె ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment