ఆగ్రో ఫాం ముసుగులో అడ్డగోలు దందా
లేపాక్షి: రియల్ ఎస్టేట్ వ్యాపారులు బరి తెగిస్తున్నారు. సంపాదనే లక్ష్యంగా ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే యథేచ్ఛగా వ్యాపారం చేస్తున్నారు. అగ్రి ఫాం (వ్యవసాయ క్షేత్రం) ముసుగులో ‘రియల్’ దందా నడుపుతున్నారు. ఇలాంటి బాగోతమే తాజాగా లేపాక్షి మండలం చోళసముద్రంలో వెలుగు చూసింది. ప్రభుత్వ నిబంధనలేవీ పాటించకుండా, అధికారుల నుంచి అనుమతులు లేకుండా రిసార్ట్ ఏర్పాటు చేశారు. దీన్ని మంగళవారం తనిఖీ చేసిన తహసీల్దార్ సౌజన్యలక్ష్మి అక్కడి వ్యవహారం చూసి కంగుతిని.. రిసార్ట్ యజమానికి నోటీసులు జారీ చేశారు.
ఆగ్రో ఫాం అంటూ...
లేపాక్షికి సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో కొడికొండ– శిర మార్గంలో చోళసముద్రం గ్రామ సర్వే నంబర్ 333–9లో మొత్తం 14 ఎకరాల భూమిలో నింబస్ గ్రూప్ ఆధ్వర్యంలో ‘నంది ఫాం రిసార్ట్’ ఏర్పాటు చేశారు. ఇందులో 51 సెంట్ల విస్తీర్ణంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా, ల్యాండ్ కన్వర్షన్ కూడా చేసుకోకుండానే క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, పార్టీ హాల్, పార్కింగ్ ఏరియా, వసతి గదులను అధునాతనంగా నిర్మించారు. మిగిలిన భూమిలో కూడా కన్వర్షన్ లేకుండానే రోడ్లు, ప్రహరీలు, లైటింగ్స్ ఏర్పాటు చేశారు.
ప్లాట్లుగా విభజించి విక్రయాలు
వ్యవసాయ భూమిని కొనుగోలు చేసిన రియల్టర్ ల్యాండ్ కన్వర్షన్ లేకుండానే 25 నుంచి 50 సెంట్ల వరకు విస్తీర్ణంలో ప్లాట్లు ఏర్పాటు చేసి విక్రయాలు సాగిస్తున్నారు. ప్లాటు విస్తీర్ణాన్ని బట్టి రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల దాకా విక్రయిస్తున్నారు. బెంగళూరు, ఇతర ప్రాంతాలకు చెందిన ఉద్యోగులు, వ్యాపారులు ఇక్కడ ప్లాట్లు కొనుగోలు చేస్తున్నారు. వ్యవసాయ భూమిగానే చూపుతూ రిజిస్టర్ చేయిస్తుండడంతో కొనుగోలుదారులు ప్రభుత్వ పథకాలకు సైతం అర్హత పొందుతున్నారు. రిసార్ట్ ఏర్పాటులో నిబంధనలేవీ పాటించకపోవడంతో తహసీల్దార్ సౌజన్యలక్ష్మి నోటీసులు అందజేశారు. వెంటనే వివరణ ఇవ్వాలని యాజమాన్యాన్ని ఆదేశించారు.
‘నంది ఫాం రిసార్టు’లో నిబంధనల ఉల్లంఘన
అనుమతులు లేకుండానే నిర్మాణాలు
నోటీసులు జారీ చేసిన తహసీల్దార్
ఆగ్రో ఫాం ముసుగులో అడ్డగోలు దందా
Comments
Please login to add a commentAdd a comment