ఎంపీపీ ఆది భూ అక్రమాలపై విచారణ చేపట్టాలి
ధర్మవరం: నిరుపేద గిరిజనులు, ఎస్సీలు సాగు చేసుకుంటున్న వందలాది ఎకరాలను ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ ఆక్రమించారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ అన్నారు. తాను ఆక్రమించిన భూములను బంధువుల పేరిట ఆన్‌లైన్ చేసుకుని ప్రభుత్వ ఫలాలు పొందుతున్న ఆది భూ అక్రమాలపై సీనియర్ ఐఏఎస్ అధికారితో విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. మంగళవారం ముదిగుబ్బ మండల పరిఽధిలోని అడవి బ్రాహ్మణపల్లి గ్రామంలో సీపీఐ నాయకులు పర్యటించారు. ఈ సందర్భంగా ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ చేతిలో మోసపోయిన బాధితులు తమ సమస్యలు చెబుతూ సీపీఐ నాయకుల ఎదుట కంటతడి పెట్టారు. తాము తాతల కాలం నుంచి భూములు సాగు చేసుకుంటున్నామని, అప్పట్లో ప్రభుత్వం తమకు పట్టాదారు పాసుపుస్తకాలు సైతం మంజూరు చేసిందన్నారు. కానీ వన్‌బీ, ఆడంగల్‌లో మాత్రం ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ తన బంధువుల పేర్లు ఎక్కించుకుని తమకు అన్యాయం చేశారన్నారు. స్పందించిన రామకృష్ణ... ఎంపీపీ ఆది నారాయణ యాదవ్ భూఆక్రమణలతో నష్టపోయిన నిరుపేద గిరిజన, ఎస్సీలకు న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతామన్నారు. మండలంలో 400 ఎకరాల దాకా ఎంపీపీ చేతిలో భూములు ఉన్నాయని, ఆదినారాయణ యాదవ్ అమాయక రైతులకు అన్యాయం చేస్తుంటే మంత్రి సత్యకుమార్ మౌనం వహించడం ఆశ్చర్యమేస్తోందన్నారు. ధర్మవరం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా, రాష్ట్రానికి మంత్రిగా ఉన్న సత్యకుమార్ సొంత నియోజకవర్గంలో ఉన్న బాధితులకు న్యాయం చేయడంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈనెల 7న రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను కలిసి బాధితులకు న్యాయం చేసి భూయాజమాన్య హక్కులు కల్పించేలాగా చర్యలు చేపట్టాలని కోరతామన్నారు. అప్పటికీ ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటమయ్య, చేనేత సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింకా చలపతి, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు, రవి, రమణ, శ్రీరాములు, సంతోష్‌కుమార్, బండల వెంకటేశ్, లక్ష్మీనారాయణ, వెంకటనారాయణ, వెంకటస్వామి, శ్రీనివాసులు, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
గిరిజనులు, ఎస్సీల భూములు
ఆక్రమించి అన్యాయం చేశారు
బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతాం
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
Comments
Please login to add a commentAdd a comment