వేసవి జాగ్రత్తలపై ప్రజలను చైతన్యపరచండి
● డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఫైరోజాబేగం
చెన్నేకొత్తపల్లి: ప్రస్తుత వేసవిలో ఎండ ప్రభావం తీవ్రంగా ఉండనుండడంతో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను చైతన్య పరచాలని వైద్య, ఆరోగ్య సిబ్బందిని డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఫైరోజాబేగం ఆదేశించారు. మంగళవారం సీకేపల్లిలో ఆమె పర్యటించారు. మురుగునీరు నిల్వ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం ఎన్‌ఎస్‌గేట్‌లోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. సిబ్బంది వివరాలు, మందుల నిల్వలపై ఆరా తీశారు. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఎలా చేస్తున్నారంటూ వైద్యాధికారి డాక్టర్ రవినాయక్‌ను అడిగి తెలుసుకున్నారు. పీహెచ్‌సీలో ప్రసవాల సంఖ్య పెరగాలన్నారు. రాత్రి సమయాల్లో రోగులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ప్రాణాలు బలిగొన్న మద్యం
అమడగూరు: మద్యం సేవించిన కాసేపటికే ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన మేరకు... అమడగూరు మండలం జేకేపల్లికి చెందిన గుడిసిపలిల గంగులప్ప (55) మంగళవారం ఉదయం గ్రామంలోని బెల్టుషాపులో మద్యం బాటిల్ కొనుగోలు చేసి అక్కడే తాగాడు. కాసేపటి తర్వాత అపస్మారకస్థితికి చేరుకోవడంతో బెల్ట్‌షాపు నిర్వాహకుడి సమాచారంతో కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. అప్పటికే మరణించినట్లు నిర్ధారించుకుని బోరున విలపించారు. కాగా, అతిగా మద్యం సేవించి మృతి చెందాడా? లేదా కల్తీ మద్యం ప్రభావంతో మరణించాడా? అనే అనుమానాలు స్థానికుల నుంచి వ్యక్తమయ్యాయి.
దుకాణం దగ్ధం
తనకల్లు: మండలంలోని ఏనుగుగుండుతండాలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ కిరాణా దుకాణం దగ్ధమైంది. తండాకు చెందిన రమణానాయక్ మంగళవారం తన కిరాణా దుకాణానికి తాళం వేసి బోరు బావి వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో దుకాణంలో షార్ట్ సర్క్యూట్ చోటు చేసుకుని నిప్పు రవ్వలు ఎగిసి పడి మంటలు వ్యాపించాయి. దుకాణంలో నుండి దట్టమైన పొగ బయటకు వస్తుండడంతో గమనించిన స్థానికుల సమాచారంతో రమణానాయక్ అక్కడకు చేరుకున్నాడు. స్థానికుల సాయంతో తలుపులను బద్దలుగొట్టి మంటలను ఆర్పి వేశారు. ఇతరులకు ఇచ్చేందుకు దుకాణంలోని ఓ పెట్టెలో ఉంచిన రూ. 3 లక్షల నగదుతో పాటు రూ.లక్ష విలువైన సరుకులు కాలిపోయాయి.
వేసవి జాగ్రత్తలపై ప్రజలను చైతన్యపరచండి
Comments
Please login to add a commentAdd a comment