వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
పెనుకొండ: బెంగళూరుకు చెందిన శివకుమార్, కార్తీక్ బుధవారం రాత్రి చిక్కబళ్లాపురం వైపుగా కారులో వెళుతుండగా పులేకమ్మ గుడి సమీపంలో 44వ జాతీయ రహదారిపై వాహనం మొరాయించడంతో రోడ్డు పక్కన ఆపేశారు. అర్ధరాత్రి కావడంతో ఆ మార్గంలో వెళుతున్న వాహనదారులను ఆపి లిఫ్ట్ అడిగే ప్రయత్నం చేశారు. అదే సమయంలో అటుగా వచ్చిన ద్విచక్ర వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తుండగా వాహనదారుడు నియంత్రణ కోల్పోయి శివకుమార్, కార్తీక్‌ను ఢీకొన్నాడు. ద్విచక్ర వాహనంపై ముగ్గురు ప్రయాణిస్తుండగా ఆఖరున కూర్చొన్న యువకుడు కిందపడి డివైడర్‌ను ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడిని సోమందేపల్లికి చెందిన మనోజ్ (22)గా గుర్తించారు. తన స్నేహితులు ప్రేమ్, అర్షద్‌తో కలసి ద్విచక్ర వాహనంపై పెనుకొండ వైపు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇదే ఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రేమ్, శివకుమార్, కార్తీక్, అర్షద్‌ను అటుగా వెళుతున్న వారు పెనుకొండలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉన్న ప్రేమ్‌ను కర్నూలుకు రెఫర్ చేశారు. ఘటనపై పెనుకొండ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా, మనోజ్ పుట్టిన రోజే ప్రమాదంలో మృతిచెందడంతో కుటుంబసభ్యుల రోదనలకు అంతులేకుండా పోయింది.
● పెనుకొండ రూరల్: కర్ణాటకలోని పావగడ తాలూకా కడుమలకుంట గ్రామానికి చెందిన లక్ష్మీదేవి (33), నాగేంద్ర దంపతులు గురువారం ఉదయం తమ కుమార్తె మహితతో కలసి ద్విచక్ర వాహనంపై కనగానపల్లి మండలం దాదులూరు వద్ద వెలసిన పోతలప్ప స్వామి ఆలయానికి వెళ్లారు. పూజలు ముగించుకున్న అనంతరం తిరుగు ప్రయాణమైన వారు గుట్టూరు శివారులోకి చేరుకోగానే బెంగళూరుకు వెళుతున్న కారు వెనుక నుంచి వేగంగా ఢీకొంది. ఘటనలో నాగేంద్రమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. స్వల్ప గాయాలతో నాగేంద్ర బయటపడ్డాడు. ఘటనపై కియా పోలీసులు కేసు నమోదు చేశారు.
పెనుకొండ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై చోటు చేసుకున్న వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. వీరిలో ఒకరు కర్ణాటక ప్రాంతానికి చెందిన మహిళ కాగా, మరొకరు సోమందేపల్లికి చెందిన యువకుడు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తుండగా చోటు చేసుకున్న ప్రమాదాల్లో వారు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాలు...
Comments
Please login to add a commentAdd a comment