క్వింటా చింతపండు రూ.31 వేలు
హిందూపురం అర్బన్: చింతపండు ధర మార్కెట్‌లో నిలకడగా కొనసాగుతోంది. స్థానిక వ్యవసాయ మార్కెట్‌కు గురువారం 1,214.70 క్వింటాళ్ల చింతపండు రాగా, అధికారులు ఈ–నామ్ పద్ధతిలో వేలం పాట నిర్వహించారు. ఇందులో కరిపులి రకం చింతపండు క్వింటా గరిష్టంగా రూ.31 వేలు, కనిష్టంగా రూ.8,100, సగటున రూ.18 వేల ప్రకారం ధర పలికింది. ఇక ప్లవర్ రకం చింతపండు క్వింటా గరిష్టంగా రూ. 12 వేలు, కనిష్టంగా రూ.4,200, సగటున రూ. 6,500 ప్రకారం క్రయవిక్రయాలు సాగినట్లు మార్కెట్ కార్యదర్శి జి. చంద్రమౌళి తెలిపారు.
ఏపీఆర్‌ఎస్‌లో ప్రవేశానికి
దరఖాస్తుల ఆహ్వానం
పరిగి: మండలంలోని కొడిగెనహళ్లిలో ఉన్న ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ బాలుర పాఠశాలలో (ఏపీఆర్‌ఎస్‌ఓఈ) ప్రవేశానికి 2025–26 విద్యా సంవత్సరానికి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విద్యా సంస్థల జిల్లా కన్వీనర్, ప్రిన్సిపల్ ఎన్వీ మురళీధర్‌బాబు ఓ ప్రకటనలో తెలిపారు. ఈమేరకు గురువారం స్థానిక పాఠశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. పాఠశాలలో 5వ తరగతిలో ప్రవేశానికి ఉన్న 80 సీట్లకుగాను రాయలసీమలోని ఉమ్మడి నాలుగు జిల్లాలతో పాటూ నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్న బాలురు మాత్రమే ఇందుకు అర్హులన్నారు. ఏపీఆర్‌ఎస్ క్యాట్ (ఏపీఆర్‌ఎస్ సీఏటీ) అర్హత పరీక్ష ద్వారా ప్రవేశం పొందవచ్చన్నారు. అర్హులైన విద్యార్థులు https://aprs.apcfss.in అనే వెబ్‌సైట్‌లో వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 31 వరకూ గడువు విధించామన్నారు. అదేవిధంగా ఏప్రిల్ 25న జరిగే ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన వారి మార్కుల ప్రతిభ ఆధారంగా ప్రవేశాన్ని కల్పిస్తున్నట్లు వివరించారు. మరిన్ని వివరాలకు 87126 25065 సెల్ నంబరును సంప్రదించాలన్నారు.
అర్జీలకు నాణ్యమైన
పరిష్కారం చూపాలి
ప్రశాంతి నిలయం: రెవెన్యూ సదస్సుల్లో ప్రజలు అందజేసిన అర్జీలతో పాటు పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ సూచించారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో అర్జీల పరిష్కారం, వెబ్‌ల్యాండ్ పెండింగ్ ఫైల్స్‌పై ఆర్డీఓలు, తహసీల్దార్లు, మండల సర్వేయర్లతో ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల జరిగిన రెవెన్యూ సదస్సులు, పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన అర్జీలను మార్చి 15లోపు పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి అర్జీని రిజిస్టర్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణరెడ్డి, పలువురు అధికారుల పాల్గొన్నారు.
నీటితొట్టెలో పడి
చిన్నారి మృతి
ఓడీచెరువు: నీటి తొట్టెలో పడి చిన్నారి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని వేమారెడ్డిపల్లిలో గురువారం చోటు చేసుకుంది. వేమారెడ్డిపల్లికి చెందిన గంగరాజు, రాధిక భార్యభర్తలు. వారికి బాలిక (5)తో పాటు బాలుడు ద్వారక (4) ఉన్నారు. దంపతులిద్దరూ పనుల నిమిత్తం పొరుగు గ్రామానికి వెళ్లారు. నానమ్మ, తాత వద్ద పిల్లలు ఉన్నారు. అయితే బాలుడు ఆడుకుంటూ ఇంటి వెనుక పశువుల పాకలో ఏర్పాటు చేసిన నీటితొట్టెలో పడిపోయాడు. చుట్టు పక్కలవారు గట్టిగా కేకలు వేయడంతో ఆ బాలుడిని తొట్టెనుంచి బయటకు తీశారు. వెంటనే కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే ద్వారక చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
క్వింటా చింతపండు రూ.31 వేలు
క్వింటా చింతపండు రూ.31 వేలు
క్వింటా చింతపండు రూ.31 వేలు
Comments
Please login to add a commentAdd a comment