గురుకులాల్లో ప్రవేశాలకు ఆహ్వానం
అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలోని ఏపీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరంలో ఐదో తరగతి ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఏపీఆర్ గురుకుల పాఠశాలల జిల్లా కన్వీనర్ జీఏ విజయలత సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. గుత్తి బాలికల గురుకుల పాఠశాల, నూతిమడుగు బాలుర గురుకుల పాఠశాల, గార్లదిన్నె మైనార్టీ బాలుర పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఐదో తరగతిలో 80 సీట్లు (ఇంగ్లిష్ మీడియం), 6, 7, 8 తరగతుల్లో మిగిలిపోయిన ఖాళీలకు ఈ నెల 31లోపు https://aprs.apcfss.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు అర్హులేనని కన్వీనర్ స్పష్టం చేశారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఏప్రిల్ 25న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.
దరఖాస్తు గడుపు పెంపు
రొళ్ల: మండల పరిధిలోని దొమ్మరహట్టి వద్ద ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలో (2025–26 విద్యా సంవత్సరం) 5వ తరగతి ప్రవేశానికి దరఖాస్తు గడవును పొడిగించినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ మైలారప్ప తెలిపారు. వాస్తవానికి మార్చి 6వ తేదీ వరకే గడువు ఉండగా... ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈనెల 13వ తేదీ వరకూ పొడిగించినట్లు వెల్లడించారు. పాఠశాలలో 80 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు.
బీసీ గురుకుల ప్రవేశ
పరీక్ష కేంద్రాల పెంపు
అనంతపురం ఎడ్యుకేషన్: మహాత్మ జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరానికి గాను ఐదో తరగతి ప్రవేశాలకు నిర్వహించనున్న రాత పరీక్షకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏడు కేంద్రాలను పెంచారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 16 కేంద్రాలు ఉండగా.. దరఖాస్తులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో అదనంగా ఏడు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అనంతపురం జిల్లా కన్వీనర్ జోనాథన్ తెలిపారు. కొత్త పరీక్ష కేంద్రాలు శనివారం నుంచి ఆన్‌లైన్‌లో కనిపిస్తాయని పేర్కొన్నారు.
అదనంగా పెంచిన కేంద్రాలివే..
● ప్రభుత్వ బీసీ కళాశాల బాలికల వసతి గృహం, కళ్యాణదుర్గం
● ప్రభుత్వ బీసీ కళాశాల బాలికల వసతి గృహం, శింగనమల (అనంతపురం రామ్‌నగర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ పక్కన)
● ప్రభుత్వ బీసీ కళాశాల బాలుర వసతి గృహం, నార్పల (అనంతపురంలోని కొత్తూరు బాలుర జూనియర్ కళాశాల)
● ప్రభుత్వ బీసీ కళాశాల బాలికల వసతి గృహం, నార్పల (అనంతపురం హౌసింగ్‌బోర్డు మెయిన్ రోడ్డు ఎస్‌వీఆర్ కేఫ్ పక్కన)
● ప్రభుత్వ బీసీ బాలుర వసతిగృహం, రాయదుర్గం
● ప్రభుత్వ బీసీ కళాశాల బాలికల వసతి గృహం, అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి వెనుక, అరవిందనగర్)
● ప్రభుత్వ బీసీ కళాశాల బాలుర వసతి గృహం, మోడల్ స్కూల్ దగ్గర ధర్మవరం.
15లోపు సప్లి ఫీజు చెల్లించాలి
అనంతపురం ఎడ్యుకేషన్: నగరంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో 2016–17 నుంచి 2018–19 విద్యాసంవత్సరాల డిగ్రీ విద్యార్థులకు మెగా సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ పద్మశ్రీ ఓ ప్రకటనలో తెలిపారు. 1 నుంచి 6 సెమిస్టర్ల విద్యార్థులకు ఈ పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. పరీక్ష ఫీజు ఈ నెల 15లోగా చెల్లించాలని సూచించారు. అపరాధ రుసుముతో పరీక్షలు ప్రారంభమయ్యే వరకు ఫీజు చెల్లించవచ్చని స్పష్టం చేశారు.
ఎండుమిర్చికి ధరాఘాతం
హిందూపురం అర్బన్: ఎండుమిర్చికి మార్కెట్‌లో డిమాండ్ తగ్గిపోతోంది. ఫలితంగా ధర రోజురోజుకూ పడిపోతోంది. శుక్రవారం స్థానిక వ్యవసాయ మార్కెట్‌కు 84.80 క్వింటాళ్ల ఎండుమిర్చి రాగా, అధికారులు ఈ–నామ్ పద్ధతిలో వేలంపాట నిర్వహించారు. ఇందులో మొదటి రకం ఎండుమిర్చి క్వింటా గరిష్టంగా రూ.12 వేలు, కనిష్టంగా రూ.7 వేలు, సరాసరిన రూ.7,200 మేర ధర పలికింది. గత వారంతో పోలిస్తే క్వింటా గరిష్ట ధరపై ఏకంగా రూ.2,500 తగ్గింది. మార్కెట్‌కు నాణ్యమైన మిర్చి రాకపోవడంతో ధర తగ్గినట్లు కార్యదర్శి చంద్రమౌళి తెలిపారు.
గురుకులాల్లో ప్రవేశాలకు ఆహ్వానం
Comments
Please login to add a commentAdd a comment